23 దేశాలు.. 59 వైరాలజీ ల్యాబ్‌లు.. ఎంత భద్రం?

23 Jun, 2021 08:10 IST|Sakshi

సాక్షి ,సెంట్రల్‌ డెస్క్‌: ఏడాదిన్నరగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌.. చైనాలోని వూహాన్‌ వైరాలజీ ల్యాబ్‌ నుంచే లీకైందన్న సందేహాలు ఉన్నాయి. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే వైరస్‌లపై ప్రయోగాలు చేసే ల్యాబ్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదమేనన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. ఒక్క వూహాన్‌ ల్యాబ్‌ నుంచి బయటికొచ్చిన ఒక్క వైరస్‌ ఇంత ప్రమాదకరంగా మారితే.. ప్రపంచవ్యాప్తంగా అలాంటి ల్యాబ్‌లు ఎన్ని ఉన్నాయి? వాటిలో భద్రతాప్రమాణాల పరిస్థితి ఏమిటన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. దీనిపై ‘న్యూక్లియర్‌ త్రెట్‌ ఇనిషియేటివ్‌ (ఎన్‌టీఐ)’ విస్తృతంగా స్టడీచేసి నివేదిక విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందామా? 

ప్రపంచంలో పెద్దది.. వూహాన్‌ ల్యాబ్‌ 
బీఎస్‌ఎల్‌–4 ల్యాబ్‌ల పరిమాణం కూడా ఎంతో కీలకం. చిన్నస్థాయిలో ల్యాబ్‌లలో పరిశోధనలు తక్కువైనా, ప్రమాదకర సూక్ష్మజీవులు బయటికొచ్చే ప్రమాదమూ తక్కువగానే ఉంటుంది. పెద్ద ల్యాబ్‌లలో ఎక్కువ సంఖ్యలో సూక్ష్మజీవులపై, విస్తృత ప్రయోగాలు జరుగుతుంటాయి. లీకయ్యే ప్రమాదం కాస్త ఎక్కువే. 
► చైనాలోని వూహాన్‌ వైరాలజీ ల్యాబ్‌ ప్రపంచంలోనే అతి పెద్దది. దాని విస్తీర్ణం 3 వేల చదరపు మీటర్ల (32 వేల చదరపు అడుగుల)కుపైనే ఉంటుంది. 
► 11 ల్యాబ్‌లు వెయ్యి చదరపు మీటర్లపైన.. మరో 11 ల్యాబ్‌లు 200–1000 చదరపు మీటర్ల మధ్య.. 22 ల్యాబ్‌లు 200 చదరపు మీటర్ల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. మరికొన్ని ల్యాబ్‌ల వివరాలు అందుబాటులో లేవు. 

ప్రమాదంతో.. ప్రయోగాలు 
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ల్యాబ్‌లలో వైరస్‌లు, సూక్ష్మజీవులపై పరిశోధనలు చేస్తుంటారు. అందులో మందులు, వ్యాక్సిన్లు లేని అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లపై ప్రయో గాలు చేసే ల్యాబ్‌లకు ‘బయో సేఫ్టీ లెవల్‌ 4 (బీఎస్‌ఎల్‌–4)’ భద్రతా ప్రమాణాలు తప్పనిసరి. దీనికి అత్యంత కఠినమైన నిబంధనలు ఉంటాయి. 
►  బీఎస్‌ఎల్‌–4 ల్యాబ్‌లలో పరిశోధకులు మొత్తం శరీరాన్ని కప్పేసి, లోపలి నుంచే ఆక్సిజన్‌ అందించే ప్రెషరైజ్డ్‌ సూట్స్‌ ధరించాల్సి ఉంటుంది.  

భద్రత, రక్షణ ఎంతెంత? 
బీఎస్‌ఎల్‌–4 ల్యాబ్‌లు ఉన్న 22 దేశాల్లో (తైవాన్‌ మినహా) భద్రత, రక్షణ ప్రమాణాలపై ‘న్యూక్లియర్‌ త్రెట్‌ ఇనిషియేటివ్‌ (ఎన్‌టీఐ)’ ఆధ్వర్యంలో గ్లోబల్‌ హెల్త్‌ సెక్యూరిటీ ఇండెక్స్‌ ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. ఆయా దేశాల్లో పరిస్థితులు, చట్టాలు, విధానాలు, రక్షణ చర్యల ఆధారంగా అంచనాలు వేసింది. 
►  ప్రమాదకర సూక్ష్మజీవులు లీక్‌కాకుండా చేపట్టే కట్టుదిట్టమైన ‘బయోసేఫ్టీ’ చర్యలను పరిశీలిస్తే.. 6 దేశాల్లో ఉత్తమంగా, 11 దేశాల్లో మధ్యస్థంగా, 5 దేశాల్లో తక్కువగా ఉన్నాయి.
►  ప్రమాదకర వైరస్‌లను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా (జీవాయుధంగా) విడుదల చేయకుండా తీసుకునే ‘బయోసెక్యూరిటీ’ చర్యలు.. ఐదు దేశాల్లోనే బాగుండగా, 8 దేశాల్లో మధ్యస్థంగా, 9 దేశాల్లో చాలా తక్కువగా ఉన్నాయి.
► వైరాలజీ ల్యాబ్‌లు ఉన్నా, లేకున్నా మొత్తం గా 195 దేశాల్లో బయోసేఫ్టీ, బయోసెక్యూరిటీ పరిస్థితులను ఎన్‌టీఐ పరిశీలించింది. 60శాతం దేశాల్లో బయోసేఫ్టీ దారుణంగా ఉందని, బయో సెక్యూరిటీ చర్యలు అయితే 80 శాతం దేశాల్లో అతితక్కువగా ఉందని తేల్చింది.

పట్టణ ప్రాంతాల్లోనే..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర వైరస్‌లపై ప్రయోగాలు చేస్తున్న, నిర్మాణంలో ఉన్న ల్యాబ్‌లు 23 దేశాల్లో 59 చోట్ల ఉన్నాయి. ఖండాల వారీగా చూస్తే.. యూరప్‌లో 25, ఉత్తర అమెరికాలో 14, ఆసియాలో 13, ఆస్ట్రేలియాలో 4, ఆసియాలో 3 ల్యాబ్‌లు ఉన్నాయి.
► మొత్తం ల్యాబ్‌లలో 60 శాతం ప్రభుత్వ రంగంలో, 20 శాతం యూనివర్సిటీల ఆధ్వర్యంలో, మరో 20 శాతం ప్రైవేటు సంస్థల పరిధిలో కొనసాగుతున్నాయి. వైరస్‌లు, ఇతర సూక్ష్మజీవుల సామర్థ్యం, వ్యాప్తి,సోకితే వచ్చే లక్షణాలు, వాటి నిర్మాణ క్రమం, ఎదుర్కొనేందుకు తోడ్పడే అంశాలపై ప్రయోగాలు నిర్వహిస్తుంటారు.
►  59 ల్యాబ్‌లకుగాను 46 ల్యాబ్‌లు పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఒకవేళ వైరస్‌ లీకైతే దా ని ప్రభావం వేగంగా, ఎక్కువగా ఉంటుంది.

ల్యాబ్‌ల నియంత్రణ ఎలా? 
►  ‘బయోలాజికల్‌ వెపన్స్‌ కన్వెన్షన్‌’, ఐక్యరాజ్యసమితి భద్రాతామండలి తీర్మానాల ప్రకారం.. బీఎస్‌ఎల్‌–4 ల్యాబ్‌లు ఉన్న దేశాన్నీ బయోసేఫ్టీ, సెక్యూరిటీ కోసం చట్టాలు చేసి, ల్యాబ్‌లపై నిఘా పెట్టాల్సి ఉంటుంది.
►  ప్రమాదకర ల్యాబ్‌లు ఉన్న దేశాల్లో సగానికన్నా తక్కువ దేశాలు మాత్రమే ‘ఇంటర్నేషనల్‌ బయోసేఫ్టీ, సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్‌ గ్రూప్‌’లో సభ్యులుగా ఉండటం గమనార్హం.
►  ల్యాబ్‌లలో చేసిన పరిశోధనలు దుర్వినియోగం కాకుండా కఠిన చట్టాలు, విధానాలను కేవలం మూడు (ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్‌) మాత్రమే అమలు చేస్తున్నాయి. మరో మూడు (జర్మనీ, స్విట్జర్లాండ్, బ్రిటన్‌) దేశాల్లో పలు నిబంధనలు ఉన్నాయి. మిగతా చోట్ల ఈ పరిస్థితి లేదు.
చదవండి:  కోవాగ్జిన్‌ ఒప్పందం.. బ్రెజిల్‌లో ప్రకంపనలు

మరిన్ని వార్తలు