‘చుక్కలు’ చూపించే హోటల్‌

5 Jul, 2022 03:00 IST|Sakshi

ఆరుబయట పడుకుని ఆకాశంలోని నక్షత్రాలను లెక్కపెట్టడం... గ్రాండ్‌ పేరెంట్స్‌తో కథలు చెప్పించుకోవడం... 80ల్లోని పిల్లలకు ఓ మధురమైన జ్ఞాపకం. అలా ముచ్చట్లతోనే నిద్రలోకి జారుకునేవాళ్లు. ఇప్పుడు అట్లాంటి ఆరుబయట పడుకునే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది స్విట్జర్లాండ్‌లోని ఓ హోటల్‌. దాని పేరు నల్‌ స్టెర్న్‌ హోటల్‌ (జీరో స్టార్‌ హోటల్‌). దీని ప్రత్యేకత ఏంటంటే... ఒక ప్లాట్‌ఫామ్‌ మీద డబుల్‌ కాట్‌బెడ్, అటూఇటూ ల్యాంప్స్‌.

అంతే.. గోడలు ఉండవు. తలు పులు ఉండవు. పైకప్పు అసలే లేదు. ఏకాంతం, రక్షణ కలిగించే ఏ సదు పాయమూ ఉండబోదు. హోటలియర్‌ డానియేల్‌ కార్బొనియెర్‌ రూపొందించిన ఈ ప్రాజెక్టు ఆలోచన స్విస్‌ ఆర్టిస్టులు ఫ్రాంక్‌ రిక్లిన్, పాట్రిక్‌ రిక్లిన్‌ బ్రదర్స్‌ది. ఇక్కడ స్టే చేస్తే.. ‘రాత్రంతా నిద్ర పట్టలేదు...’, ‘ఏం చప్పుళ్లురా బాబోయ్‌’ అనే ఫిర్యాదులు రావొచ్చు. కానీ ఆ ఆలోచన కల్పించేందుకే దీన్ని తయారు చేశామంటున్నారు రిక్లిన్‌ బ్రదర్స్‌.

వచ్చిన అతిథులకు ప్రపంచంలో ఉన్న సమస్యలు ప్రత్యేకించి... వాతావరణంలో వస్తున్న మార్పులు, యుద్ధం, మాయమవుతున్న మానవత్వం వంటివన్నీ భూమికెంత నష్టం చేస్తున్నాయో తెలియజెప్పడమే ఈ ‘జీరో స్టార్‌ హోటల్స్‌’ లక్ష్యమని చెబుతున్నారు. ఇక హోటల్‌లో ఒక నైట్‌ స్టే చేయాలంటే.. దాదాపు రూ. 27 వేలు చెల్లించాల్సి ఉంటుంది. డ్రింక్స్, బ్రేక్‌ఫాస్ట్‌ అన్నీ అక్కడికే తెచ్చిస్తారు. జూలై 1 నుంచి సెప్టెంబర్‌ వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతానికి సైలన్‌ గ్రామంలోని ఓ పెట్రోల్‌ బంక్‌ పక్కన, మరో వైన్‌యార్డ్‌లో, పిక్చర్‌స్క్వేర్‌ కొండ పక్కన వీటిని ఏర్పాటు చేశారు.  

మరిన్ని వార్తలు