పిచ్చా.. వెర్రా అసలు ఏం అనాలి?!

5 Jan, 2021 20:45 IST|Sakshi

బెర్లిన్‌: పిచ్చి పలు రకాలు.. వెర్రి వేయి రకాలు అంటారు. నిజమే కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొ రకమైన పిచ్చి ఉంటుంది. కొందరికి ఉన్న పిచ్చి గురించి మనం తెలుసుకుంటే.. మనకు కూడా పిచ్చి పీక్స్‌కు వెళ్తుంది. ఓ వ్యక్తి చేసిన పని వల్ల ఇప్పుడు ఈ పిచ్చి పురాణాన్ని స్మరించుకోవాల్సి వచ్చింది. ఏమా పని అంటే ఇది చదవాల్సిందే. స్మార్ట్‌ఫోన్‌లకు బ్యాక్‌ కవర్‌ తప్పని సరి. ఎప్పుడైనా ఫోన్‌ కిందపడితే పగలకూడదని.. గీతలు పడకూడదనే ఉద్దేశంతో బ్యాక్‌ కవర్‌ వేస్తాం. అది పాతది అయితే పడేసి కొత్తది కొంటాం. అంతేతప్ప వాడేసిన ఈ బ్యాక్‌ కవర్ని అమ్మే సాహసం ఎవరు చేయరు. ఒకవేళ చేస్తే.. తిట్లు తినాల్సి వస్తుంది. యూట్యూబ్‌ ఇన్‌ఫ్లూయేంజర్‌గా పని చేస్తున్న జర్మనీకి చెందిన బియాంకా క్లాసెన్ మాత్రం పాత ఫోన్‌ కవర్‌ని ఏకంగా కోటి రూపాయలకు అమ్మింది. బియాంకా ఓ సారి అండర్‌ వాటర్‌ ఫోటో షూట్‌లో పాల్గొన్నప్పుడు ఆమె ఫోన్‌ తడిసిపోయింది. (చదవండి: ట్రూ లవ్‌.. ఆలస్యంగా నడిచిన 23 రైళ్లు )

దాంతో దాని బ్యాక్‌ కవర్‌ తీసి కప్‌బోర్డ్‌లో పడేసింది. ఇక దాని గురించి మర్చిపోయింది. అలా పడేయడం వల్ల ఆ బ్యాక్‌ కవర్‌ రంగు పోయి.. ఓ పెయింటింగ్‌లా కనిపించింది. ఓ రోజు ఎందుకో కప్‌బోర్డ్‌ ఒపెన్‌ చేసిన బియాంకాకి ఫోన్‌ బ్యాక్‌ కవర్‌ కనిపించింది. పూర్తిగా పాడయిన దాన్ని పడేద్దామనుకుంటుండగా ఆమెకు ఓ వింత ఐడియా వచ్చింది. దీన్ని అమ్మకానికి పెడితే ఎలా ఉంటుందని భావించింది. దాంతో తన ఫోన్‌ బ్యాక్‌ కవర్‌ని ఈబేలో అమ్మకానికి పెట్టింది. ఆమె చేసిన పనే వింత అనుకుంటే ఆమె కన్నా వింత వ్యక్తి ఒకరు ఈ పాత వాడేసిన కవర్‌కి ఏకంగా 1,62,907 డాలర్లు(1,19,22,153.31 రూపాయలు) చెల్లించేందుకు సిద్ధపడ్డాడు. ఏదో సరదాకి చేసిన పనికి ఇంత మంచి ధర పలకడంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది బియాంకా. ఈ మొత్తం డబ్బుని ఓ చారిటీకి ఇచ్చి.. ఇళ్లు లేని వారికోసం ఖర్చు చేస్తానని వెల్లడించింది. ఇక వీరి పనికి నెటిజనులు మీరు, మీ పిచ్చికి ఓ దండం సామీ అంటున్నారు. 

మరిన్ని వార్తలు