బ్యాడ్‌ న్యూస్‌: ఒలింపిక్స్‌ వాయిదా?

11 Jan, 2021 11:17 IST|Sakshi

టోక్యో: కరోనా వైరస్‌ కొత్త రూపం జపాన్‌లో కలకలం రేపుతోంది. ఇప్పటికే కేసులు భారీగా నమోదవుతుండడంతో ఆ దేశ రాజధాని టోక్యోలో అత్యవసర పరిస్థితి విధించారు. ప్రస్తుతం తీవ్ర ఆంక్షలు ఆ దేశంలో అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం కొత్త వర్షన్‌ వెలుగులోకి రావడంతో విదేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. చాలా దేశాలకు విమాన సేవలను నిలిపివేశారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో టోక్యోలో జరగాల్సిన ఒలంపిక్స్‌ రద్దయ్యే అవకాశం ఉంది. లేదా కొన్నాళ్లు వాయిదా వేసేలా ఉందని ఆ దేశంలో చేసిన సర్వే తెలుపుతోంది.

దాదాపు 80 శాతం మంది టోక్యో ఒలింపిక్స్‌ రద్దు చేయాలని ఆ దేశానికి చెందిన ఓ మీడియా సంస్థ చేసిన సర్వేలో తేలింది. 35.3శాతం మంది వాయిదా వేయాలని చెప్పారు. వాస్తవానికి 2020 జూలైలో జరగాల్సి ఉండగా 2021కి వాయిదా వేశారు. 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఒలంపిక్స్‌ రీ షెడ్యూల్‌ చేశారు. అయితే ఇప్పుడు కూడా ఈ క్రీడా సంబరాలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. 

జపాన్‌లో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. 2లక్షల 80 వేలకు పైగా కేసులు నమోదవగా.. 4 వేల మంది మృత్యువాత పడ్డారు. ఇంత పెద్దమొత్తంలో కేసులు నమోదవడంతో ఆ దేశంలో తీవ్ర ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ఒలంపిక్స్‌ నిర్వహణపై సందిగ్ధం ఏర్పడింది. సర్వే చేయగా ఒలంపిక్స్‌ రద్దుకు ఎక్కువ మంది మొగ్గు చూపగా.. వాయిదా వేయాలని కొంతమంది చెప్పారు. ఏది ఏమైనా ఈ ఏడాది కూడా ఒలింపిక్స్‌ జరిగే అవకాశం కనిపించడం లేదు.

మరిన్ని వార్తలు