Omicron Variant: డెల్టా కన్నా ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువే!

24 Dec, 2021 04:47 IST|Sakshi

లండన్‌ ఇంపీరియల్‌ కాలేజీ, ఎడిన్‌బర్గ్‌ వర్సిటీ సర్వేల్లో వెల్లడి

స్పష్టం చేస్తున్న అధ్యయనాలు

అంతమాత్రాన అలసత్వం కూడదని హెచ్చరిక

టీకాలతో రక్షణ పెంచుకోవాలని సూచన

లండన్‌: కరోనా డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ వేరియంట్‌ తక్కువ తీవ్రతకలదని, అందుకే ఇది సోకిన వారిలో కొద్దిమందే ఆస్పత్రిపాలవుతున్నారని రెండు వేర్వేరు అధ్యయనాలు వెల్లడించాయి. లండన్‌ ఇంపీరియల్‌ కాలేజీ, ఎడిన్‌బర్గ్‌ యూనివర్సిటీలు రోగులు, ఆస్పత్రులనుంచి గణాంకాలు సేకరించి ఈ అధ్యయనాలను రూపొందించాయి.

డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ సోకిన వారు ఆస్పత్రిలో గడపాల్సిరావడం 40–45 శాతం తక్కువని ఇంపీరియల్‌ కాలేజీ నివేదిక తెలిపింది. గతంలో ఒకసారి కరోనా సోకి, మరలా ఇప్పుడు ఒమిక్రాన్‌ సోకినవారిలో ఆస్పత్రిలపాలయ్యే ఛాన్సులు తక్కువని తెలిపింది. టీకాలు తీసుకోనివారిలో హాస్పిటలైజేషన్‌ రిస్క్‌ అధికమేనని హెచ్చరించింది. ఒమిక్రాన్‌కు ఉన్న అధిక వేగం కారణంగా ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నివేదిక రూపకర్తల్లో ఒకరైన నీల్‌ ఫెర్గూసన్‌ చెప్పారు.

ఈ అధ్యయనం కోసం 56వేల ఒమిక్రాన్, 2.69 లక్షల డెల్టా కేసులను పరిశీలించారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ ప్రభావం తక్కువేనని ఎడిన్‌బర్గ్‌ వర్సిటీ నివేదిక తెలిపింది. ఇది సంతోషకరమైన విషయమని, కానీ అంతమాత్రాన అశ్రద్ధ కూడదని ఆరోగ్యనిపుణులు అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో ఒమిక్రాన్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న వేళ పండుగ సంబరాలపై నిబంధనలు విధిస్తున్నారు.

దక్షిణాఫ్రికాదీ అదేమాట
కరోనా గత వేరియంట్ల కన్నా ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువని దక్షిణాఫ్రికాలోని విట్‌వాటర్ర్‌సాండ్‌ యూనివర్సిటీ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్‌ తీవ్రత చాలా తగ్గిందని యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర షెరిల్‌ కోహెన్‌ చెప్పారు. మిగిలిన ఆఫ్రికన్‌ దేశాల్లో కూడా ఒమిక్రాన్‌ ప్రభావం తగ్గవచ్చని అంచనా వేశారు. అయితే అధిక వ్యాక్సినేషన్‌ ఉన్న దేశాలతో పోలిస్తే అల్ప వ్యాక్సినేషన్‌ దేశాల్లో పరిస్థితి భిన్నంగా ఉండొచ్చన్నారు.

దేశంలో నడుస్తున్న నాలుగో వేవ్‌ గత వేవ్స్‌ కన్నా తక్కువ ప్రమాదకారిగా తేలిందని దక్షిణాఫ్రికా ఆరోగ్య నిపుణులు వాసిలా జసాత్‌ చెప్పారు. ఈ వేవ్‌లో తొలి నాలుగు వారాల్లో భారీగా కేసులు నమోదయ్యాయని, అయితే వీటిలో 6 శాతం కేసులు మాత్రమే ఆస్పత్రికి చేరాయని వివరించారు. అలాగే సీరియస్‌ కండీషన్‌లోకి దిగజారిన పేషెంట్ల సంఖ్యకూడా గతం కన్నా తక్కువేనన్నారు.

గత వేవ్స్‌లో కరోనా సోకిన వారిలో 22 శాతం మరణించగా, నాలుగో వేవ్‌లో మరణాలు 6 శాతానికి పరిమితమయ్యాయని తెలిపారు. ప్రజల్లో ఇమ్యూనిటీ పెరగడం, టీకాల విస్తృతి పెరగడం, వేరియంట్‌లో విరులెన్స్‌(విష తీవ్రత) తగ్గడం వంటి అనేక కారణాలు ఇందుకు దోహదం చేసిఉండొచ్చని, దీనిపై మరింత అధ్యయనం జరగాల్సిఉందని చెప్పారు. గత వేరియంట్ల కన్నా ఒమిక్రాన్‌తో హాస్పటలైజేషన్‌ రిస్కు 80 శాతం తక్కువ కాగా తీవ్ర లక్షణాలు కనిపించే రిస్కు 70 శాతం తక్కువని  దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల సంస్థ తెలిపింది. 

మరిన్ని వార్తలు