వారంలోనే 2,75,310 కేసులు

26 Dec, 2020 02:47 IST|Sakshi

ఇంగ్లాండ్‌లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు

వేల్స్‌లో ప్రతి 60 మందిలో ఒకరికి, ఇంగ్లాండ్‌లో ప్రతి 85 మందిలో ఒకరికి కరోనా  

లండన్‌/అట్లాంటా/జొహన్నెస్‌బర్గ్‌: ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ శరవేగంగా విస్తరిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌(ఎన్‌హెచ్‌ఎస్‌) గణాంకాల ప్రకారం.. డిసెంబర్‌ 10 నుంచి 16వ తేదీ వరకు కేవలం వారం రోజుల్లో 1,73,875 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. అంతకు ముందు వారంతో పోలిస్తే ఇది 58 శాతం అధికం కావడం గమనార్హం. అలాగే డిసెంబర్‌ 17 నుంచి 24వ తేదీ దాకా ఏకంగా 2,75,310 కేసులు నమోదయ్యాయి.

దేశంలో వారం రోజుల్లోనే ఇన్ని కేసులు రికార్డు కావడం ఇదే తొలిసారి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) వ్యాప్తంగా కరోనా వ్యాప్తి అధికంగానే ఉందని ఆఫీస్‌ ఫర్‌ నేషనల్‌ స్టాటిస్టిక్స్‌(ఓఎన్‌ఎస్‌) వెల్లడించింది. వేల్స్‌లో ప్రతి 60 మందిలో ఒకరికి, ఇంగ్లాండ్‌లో ప్రతి 85 మందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలియజేసింది. కరోనా కొత్త రకం వ్యాప్తి నేపథ్యంలో యూకే ప్రభుత్వం కీలకమైన ప్రాంతాల్లో టైర్‌–4 ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో రాణి ఎలిజబెత్‌–2 క్రిస్మస్‌ వేడుకలను కేవలం తన భర్త ఫిలిప్‌తో కలిసి జరుపుకున్నారు.  కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్, మనవడు విలియమ్స్‌ ఇళ్లకే పరిమితమయ్యారు.  కాగా,  దక్షిణాఫ్రికాలోనూ 501.వీ2 అనే వేరియంట్‌ బయటపడింది. అయితే, దక్షిణాఫ్రికాలోని వేరియంట్‌ మరింత ప్రమాదకరమని, ఇది అత్యధిక వేగంతో వ్యాపించే అవకాశాలున్నాయని బ్రిటిష్‌ ఆరోగ్య శాఖ మంత్రి  వెలినీ ఖిజే ప్రకటించారు. ఈ ప్రకటనను దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి ఖండించారు.

నెగెటివ్‌ అయితేనే అమెరికాలోకి అనుమతి
బ్రిటన్‌లో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి ప్రయాణాలపై అమెరికా కొత్త ఆంక్షలు విధించింది. కరోనా నెగెటివ్‌గా తేలినవారినే తమ దేశంలోకి అనుమతిస్తామని పేర్కొంది. విమాన ప్రయాణానికి 3 రోజుల ముందే పరీక్షలు చేయించుకోవాలని, సంబంధిత రిపోర్టును విమానయాన సంస్థకు అందజేయాలని  సూచించింది. కొత్త ఆంక్షలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

>
మరిన్ని వార్తలు