ఒక్కరోజు నిద్రలేకపోతే ఇంత జరుగుతుందా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!

1 Mar, 2023 19:10 IST|Sakshi

ఒత్తిడి, మానసిక సమస్యలు, ఎక్కువగా ఆలోచించడం వంటి ఇతరత్రా కారణాల వల్ల కొంతమందికి రాత్రివేళ త్వరగా నిద్రపట్టదు. ఒక్కోసారి తీరకలేక రోజంతా మెళకువతో ఉండి నిద్రకు దూరమవుతారు. ఇలా ఒక్క రోజు నిద్రలేకపోతే ఏమవుతుందనే విషయంపై శాస్త్రవేత్తలు చేసిన పరోశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.

మనిషి ఒక్కరోజు నిద్రకు దూరమైతే మెదడు నిర్మాణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఓ పరిశోధన వెల్లడించింది. మన వయసు 1-2 ఏళ్లు పెరిగనట్లుగా మెదడు వ్యవహరిస్తుందని ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించింది. 

ఈ పరిశోధనలో తేలిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. నిద్ర లేనప్పుడు మెదడులో వచ్చిన మార్పులు, మళ్లీ గాఢంగా నిద్రపోతే యథావిధిగా మారుతాయని వెల్లడైంది. అంటే మనం ఒక రోజు నిద్రపోకపోతే వచ్చిన మార్పులు.. ఆ తర్వాత రోజు బాగా నిద్రపోతే తొలగిపోతాయి. మెదడు తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. ఈ పరిశోధనను 'జర్నల్‌ ఆఫ్ న్యూరో సైన్స్‌' ఇటీవలే ప్రచురించింది.

అయితే రోజుకు కనీసం మూడు, ఐదు, 8 గంటలు నిద్రపోతే మెదడులో ఎలాంటి మార్పులు కన్పించలేదని ఈ పరిశోధన స్పష్టం చేసింది. కానీ తక్కువ నిద్రవల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయనే విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు.

ఈ పరిశోధనలో మొత్తం 134 మంది ఆరోగ్యవంతమైన వలంటీర్లు పాల్గొన్నారు. వీరిలో 42 మంది మహిళలు కాగా.. 92 మంది పురుషులు. వయసు 19-39 ఏళ్ల మధ్య ఉంటుంది. వీరందరినీ ఐదు బ్యాచ్‌లుగా చేసి ఒకరోజు మొత్తం నిద్రలేకపోతే ఎలా ఉంటుంది? రోజులో మూడు గంటలు, ఐదు గంటలు, 8 గంటలు మాత్రమే పడుకున్నప్పుడు ఎలా ఉంటుందని పరిశోధన జరిపారు. దీనికోసం మెషీన్ లెర్నింగ్ అల్గారిథం ఉపయోగించారు.
చదవండి: వారానికి 4 రోజులు.. పని విధానంలో ఇదో కొత్త ట్రెండ్‌

మరిన్ని వార్తలు