మహమ్మారి ‘పుట్టిన రోజు’ నేడే..!

17 Nov, 2020 12:17 IST|Sakshi

కరోనా వైరస్‌: తొలి కేసుకు నేటితో ఏడాది పూర్తి

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్‌ మొదటి కేసు వెలుగు చూసి నేటికి ఏడాది పూర్తయింది. అంటే నవంబర్‌ 17, 2020కు మొదటి పుట్టిన రోజు జరుపుకుంటోంది. వాస్తవానికి ఈ వైరస్ ఎప్పుడు వెలుగు చూసిందనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ  హాంకాంగ్ పత్రిక ‘ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపిన దాని ప్రకారం 2019 నవంబర్‌ 17న చైనాలోని హుబీ ప్రావిన్స్‌కు చెందిన 55 ఏళ్ల  వ్యక్తికి మొట్ట మొదట కరోనా సోకినట్లు గుర్తించారు. వైరస్ వెలుగులోకి వచ్చిన తొలి రోజుల్లో రోజుకు ఐదు కేసులు నమోదయ్యేవి. డిసెంబరు 15 నాటికి మొత్తం కేసులు 27 ఉండగా డిసెంబర్‌20 నాటికి ఈ సంఖ్య 60 కు చేరింది.  అప్పటి నుంచి ఇప్పటి వరకు కరోనా అల్లకల్లోలాన్ని సృష్టిస్తోంది. చదవండి: 4 నెల‌ల త‌ర్వాత‌.. 30 వేల లోపు కరోనా కేసులు 

చైనాలో పుట్టిన ఈ కోవిడ్‌ నెమ్మనెమ్మదిగా ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించింది. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న దేశాలు కరోనా దెబ్బకు చేతులెత్తేసిన సందర్భాలూ ఉన్నాయి. అమెరికా, ఫ్రాన్స్‌, బ్రెజిల్‌ వంటి అగ్ర దేశాల్లో ఒకానొక సమయంలో కోవిడ్‌ వ్యాప్తి చేయి దాటి పోయింది. దీంతో లాక్‌డౌన్‌ను విధించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. ఒకరు, ఇద్దరితో మొదలైన ఈ వైరస్‌ వ్యాప్తి కోట్ల మందిని తన గుప్పిట్లోకి లాక్కుంది. లక్షల మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఆర్ఠిక వ్యవస్థను కుదేలు చేసి.. అల్లకల్లోలం సృష్టించింది. ఇప్పటికీ దాదాపు అయిదున్నర కోట్ల మంది కరోనాతో పోరాటం చేసినవారే. అయితే మొదట్లో వ్యాప్తి ప్రభావం తక్కువగా ఉండి జూన్‌, జూలై, ఆగష్టు కాలంలో విజృంభించింది. మళ్లీ దీని వ్యాప్తి క్రమంగా తగ్గముఖం పడుతోంది. చదవండి: టోక్యో ఒలింపియన్లకు వ్యాక్సిన్‌! 

ఇప్పటి వరకు 55 మిలియన్ల జనాభాకు కరోనా సోకగా 35.2మిలియన్ల మంది కోలుకున్నారు. 1.33 మిలియన్ల మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రజల జీవన విధానంలో కరోనా సరికొత్త మార్పులు కూడా తీసుకొచ్చింది. ఉరుకుల పరుగుల జీవితం నుంచి ఊరటనందించింది. మనుషుల మధ్య విలువలను, బంధాలను నేర్పించిందని చెప్పవచ్చు. అలాగే వ్యక్తిగత శుభ్రతను బోధించింది. అయితే ఈ మహమ్మారి వ్యాప్తిని ముందుగానే గుర్తించినప్పటికీ ఇప్పటి వరకు కోవిడ్‌కు సరైన విరుగుడు లేకపోవడం బాధాకర విషయంగా చెప్పకోవచ్చు. వ్యాక్సిన్‌ తయారు చేయటం కోసం ఓ వైపు వైద్యరంగ నిపుణులు, ఫార్మా కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్ననప్పటికీ పూర్తి స్థాయి వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి విడుదల కాలేదు.

మరిన్ని వార్తలు