కదలలేని వాళ్ల కోసం.. ‘ఒరిహిమి’ అవతార్‌ రోబోలు

25 Apr, 2021 10:50 IST|Sakshi

మిమ్మల్ని రోజంతా ఒక గదిలో బంధించి, సమయానికి తిండి, నీళ్లు, అవసరమైన మందులు మాత్రమే అందిస్తే ఎలా అనిపిస్తుంది? ఎటూ వెళ్లలేక, కనీసం మాట్లాడేవాళ్లూ లేక చాలా ఇబ్బందిగా ఉంటుందంటారా! ఇలా కేవలం ఒకరోజు కాకుండా వారాలు, నెలల తరబడి ఉంచితేనో? నరకయాతనే కదా?! ఏదైనా ప్రమాదంలో గాయపడో, వెన్నుపూస దెబ్బతినో, వయసైపోయో కదలలేక మంచానికే పరిమితమైన వాళ్ల పరిస్థితీ ఇదే.

వేళకు కావలసినవి అందుతున్నా మాట్లాడేవాళ్లు లేక, చేయడానికి పనిలేక వాళ్లు పడే యాతన చెప్పలేనిది. ఇలాంటి వారి బాధలు కాస్తయినా దూరం చేసేలా రోబోల తయారీ సంస్థ, జపాన్‌లోని ప్రఖ్యాత ఒరిల్యాబ్స్‌ ఓ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది. కదలలేకపోయినవారికీ కొలువు కల్పిస్తోంది. తద్వారా వారిలో ఒంటరితనాన్ని దూరం చేస్తూ మేమున్నాముంటూ అండగా నిలుస్తోంది. మంచానికే పరిమితమైనా కళ్లు, చేతి వేళ్ల కొనలు, పెదవులు కాస్తంత కదిలించగలిగిన వారికి సహాయం అందించేలా ‘ఒరిహిమి’ అవతార్‌ రోబోలను అందుబాటులోకి తెచ్చింది. 

ప్రయోగాత్మక కేఫ్‌.. 
మిగిలిన రోబోలకు భిన్నంగా ఉండే ఒరిహిమి.. అచ్చం మనిషిలానే స్పందిస్తుంది. ఈ రోబోలతో ప్రయోగాత్మకంగా రెండేళ్ల కిందట ‘అవతార్‌ కేఫ్‌ డాన్‌ వెర్షన్‌ బీటా’ కేఫ్‌ను ఏర్పాటుచేశారు. ఇందులో అతిథులు కూర్చొనే ప్రతి టేబుల్‌పైనా ఓ చిన్నపాటి ఒరిహిమి రోబో ఉంటుంది. దీని ద్వారా వాళ్లు కావాల్సినవి ఆర్డర్‌ ఇస్తారు. ఈ ఆర్డర్స్‌ను ఎక్కడో దూరాన కదలలేనిస్థితిలో మంచంమీద ఉండే కొంతమంది తమ ఎదురుగా ఉండే స్క్రీన్‌ మీద చూస్తూ నోట్‌ చేసుకొంటారు. తర్వాత వీరు ఈ ఆర్డర్స్‌ను కేఫ్‌లో ఉండే ఒరిహిమి–డి అనే పెద్ద రోబోలకు పాస్‌ చేస్తారు. మంచంమీద కదలలేని స్థితిలో ఉంటూ ఆర్డర్‌లను తీసుకునేవారిని పైలెట్లు అంటారు. వీరి ఆజ్ఞలను అనుసరించి ఒరిహిమి–డి రోబోలు కస్టమర్లకు వారు కోరుకున్నవి ట్రేల ద్వారా తీసుకెళ్లి ఇస్తాయి.

కస్టమర్లు కావాలనుకుంటే టేబుల్‌ మీద ఉన్న ‘ఒరిహిమి’ చిన్న రోబో ద్వారా నేరుగా పైలెట్లతో మాట్లాడొచ్చు. వారి బాధలను పంచుకొని ఒంటరితనాన్ని దూరం చేసేలా సాంత్వన కలిగించొచ్చు. దీనికోసం ‘ఒరిహిమి’ కళ్లలో ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ నిక్షిప్తం చేశారు. కస్టమర్లు ఇచ్చే ఆర్డర్లు తీసుకోవడానికి, వాళ్లతో మాట్లాడడానికి పైలెట్ల మంచంపైన ఓ ప్రత్యేక పరికరం ద్వారా కంప్యూటర్‌ స్క్రీన్‌ను అమర్చుతారు. పైలెట్లు ఆ స్క్రీన్‌ను చూస్తూ ఆర్డర్స్‌ తీసుకోవడం, తిరిగి పాస్‌ చేయడం, కస్టమర్లతో మాట్లాడడం చేయొచ్చు. పైలెట్లుగా పనిచేయగలిగే వారిని ఒరిల్యాబ్స్‌ సంస్థే ఎంపిక చేసుకొంటుంది.

‘అవతార్‌ కేఫ్‌ డాన్‌ వెర్షన్‌ బీటా’ను ఇప్పటివరకూ ఐదువేల మందికి పైగా కస్టమర్లు సందర్శించినట్లు ఒరిల్యాబ్స్‌ చెబుతోంది. ప్రస్తుతం టోక్యోలోని ఓటెమచిలో ఉన్న ఈ ప్రయోగాత్మక కేఫ్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. రాబోయే జూన్‌లో టోక్యోలోనే మరోచోట ఈ కేఫ్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. మనిషి ఒంటరితనాన్ని సాంకేతికతతో దూరం చేసేందుకే తమ సంస్థ ఆవిర్భవించిందని చెప్పే ఒరిల్యాబ్స్‌ ఆ ప్రయత్నంలో ‘ఒరిహిమి’ ద్వారా కొంతమేర విజయం సాధించినట్లే కనిపిస్తోంది.
చదవండి: ప్లాస్టిక్‌ వస్త్రాలు.. ఈ వనితల వినూత్న ఆలోచన

మరిన్ని వార్తలు