లండన్‌ వీధుల్లో బిన్‌ లాడెన్‌ ప్రతినిధి

11 Dec, 2020 13:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 1998లో జరిపిన టెర్రరిస్టు దాడుల్లో 224 మంది మరణానికి కారణమై అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్న దివంగత అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌కు అధికార ప్రతినిధి అయిన 60 ఏళ్ల అదెల్‌ అబ్దెల్‌ బేరీ ప్రస్తుతం లండన్‌ వీధుల్లో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. కెన్యా, టాంజానియాల్లోని అమెరికా ఎంబసీ కార్యాలయాలపై టెర్రరిస్టులు ఆగస్టు నెలలో జరిపిన వరుస బాంబు దాడుల్లో 224 మంది మరణించగా, 72 మంది గాయపడ్డారు. లండన్‌లోని తలదాచుకున్న అబ్దెల్‌ను బ్రిటన్‌ పోలీసులు 1999లో అరెస్ట్‌ చేసి, 2012లో అమెరికాకు అప్పగించారు. ఆయన అమెరికా కోర్టులో తన నేరాన్ని అంగీకరించడంతో ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. (చదవండి: ట్రంప్‌ రికార్డ్‌.. 130 ఏళ్లలో తొలిసారి)

నాటి నుంచి న్యూజెర్సీలోని డిటెన్షన్‌ సెంటర్‌లో ఉన్న అబ్దెల్‌ బాగా లావు అవడంతోపాటు అస్థమాతో బాధ పడుతున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ అమెరికా ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న నేటి పరిస్థితుల్లో అయిన్ని సురక్షితంగా ఓ గదిలో నిర్బంధించడం తమ వల్ల కాదని డిటెక్షన్‌ సెంటర్‌ అధికారులు చేతులెత్తేయడంతో ఆయనకు ముందుగా క్షమాభిక్ష ప్రసాదించి మంగళవారం నాడు విడుదల చేశారు. ఆయన ఆ మరుసటి రోజు బుధవారం నాడే లండన్‌కు చేరుకున్నారు. మెయిడా వలేలోని తన ఫ్లాట్‌కు చేరుకున్నారు. 9.8 కోట్ల రూపాయల విలువైన ఆ ఫ్లాట్‌లో ఆయన భార్య రగా (59 ఏళ్లు) నివసిస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఆయన తన భార్యను కలసుకున్నారు. 

జన్మతా ఈజిప్షియన్‌ అయిన అబ్దెల్‌కు 1991 బ్రిటన్‌ ఆశ్రయం లభించింది. ఇప్పుడు ఆయన్ని వెనక్కి పంపించుదామంటే అమెరికా అధికారులు వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అటు ఈజిప్టుకు పంపిద్దామంటే మానవ హక్కుల సమస్య ఉత్పన్నం అవుతుందని బ్రిటన్‌ అధికారులు ఆందోళన పడుతున్నారు. మళ్లీ ఆయన టెర్రరిస్టు కార్యాకలాపాలవైపు వెళ్లకుండా ఆయనపై నిఘా కొనసాగించే విషయంలోనూ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. 

మరిన్ని వార్తలు