China: డ్రాగన్‌ దుశ్చర్య.. 55 గుర్రాలపై వందమంది చైనా సైనికులు

29 Sep, 2021 10:27 IST|Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో తరచూ వివాదాలు సృష్టిస్తున్న చైనా మరోమారు తన దుర్భుద్ధిని చూపింది. గతనెల దాదాపు వందమందికి పైగా చైనా సైనికులు ఎల్‌ఏసీ(వాస్తవాధీన రేఖ)ని అతిక్రమించారని ఎకనమిక్‌టైమ్స్‌ కథనం పేర్కొంది. ఉత్తరాఖండ్‌లోని బారాహటి సెక్టార్‌లోని ఎల్‌ఏసీ వద్ద ఆగస్టు 30న సరిహద్దు దాటివచ్చిన చైనా సైనికులు మూడుగంటలకు పైగా గడిపి వెనక్కు వెళ్లారని తెలిపింది. 55 గుర్రాలపై వచ్చిన వీళ్లు అక్కడ ఇండియా ఏర్పరుచుకున్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశారని, అక్కడున్న ఒక బ్రిడ్జిని ధ్వంసం చేశారని కథనంలో వెల్లడించింది. 
చదవండి:  (చైనాను బూచిగా చూపుతున్నాయి!)

టున్‌జున్‌లా కనుమ మార్గం గుండా వచ్చిన చైనా సైనికులు భారతీయ భూభాగంలోకి సుమారు 5 కిలోమీటర్ల వరకు చొచ్చుకువచ్చినట్లు తెలిపింది. ఇదే సమయంలో స్థానికులు నుంచి సమాచారం అందుకొని అక్కడకు ఐటీబీపీ బలగాలు వెంటనే వచ్చాయి. వారు రాకముందే చైనా సైనికులు వెనక్కుపోయారు.  చైనా దుశ్చర్యకు ప్రతిస్పందనగా భారతీయ బలగాలు ఇక్కడ పెట్రోలింగ్‌ ఆరంభించాయని సదరు కథనం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాలూ బలగాల ఉపసంహరణకు అంగీకరించినా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. వాస్తవాధీన రేఖపై ఇరుదేశాల అవగాహనలో తేడాల వల్లనే తరచూ చైనా బలగాలు సరిహద్దులు దాటుతున్నాయని సైనిక  వర్గాలు తెలిపాయి. 
చదవండి:  (భారతీయులపై ఆంక్షలు.. సమర్థించుకున్న చైనా)

మరిన్ని వార్తలు