Mexico Bar Attack: బార్‌లో అర్ధరాత్రి కాల్పుల మోత.. 12 మంది మృతి!

16 Oct, 2022 11:30 IST|Sakshi

మెక్సికో సిటీ: గుర్తు తెలియని కొందరు దుండగులు బారులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన సెంట్రల్‌ మెక్సికో ఇరాపుటో నగరంలో శనివారం రాత్రి జరిగింది. గ్వానాజువాటో రాష్ట్రంలో నెల రోజుల వ్యవధిలోనే కాల్పుల ఘటన జరగటం ఇది రెండోది కావటం గమనార్హం. ఈ దాడిలో ముగ్గురు గాయపడినట్లు సిటీ ప్రభుత్వం తెలిపింది. నరమేధానికి పాల్పడిన దుండగుల కోసం భారీగా బలగాలను మోహరించినట్లు వెల్లడించింది. 

బార్‌లోకి చొరబడి కాల్పులు జరిపేందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఉన్నతాధికారులు తెలిపారు. గ్వానాజువాటో ప్రధానంగా ప్రపంచస్థాయి కార్‌ మేకర్స్‌కు తయారీ హబ్‌గా ఉంది. అయితే.. కొద్ది సంవత్సరాలుగా డ్రగ్స్‌ గ్యాంగ్స్‌ మధ్య భీకర పోరు జరుగుతుండటంతో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 21న గ్వానాజువాటోలోని ఓ బార్‌లో కాల్పులు జరగటం వల్ల 10 మంది మరణించారు. 2018లో అధికారం చేపట్టిన అధ్యక్షుడు అండ్రెస్‌ మన్యూయెల్‌ లోపేజ్‌ ఒబ్రేడర్‌.. గ్యాంగ్‌ హింసలను తగ్గించారు. అయితే.. డ్రగ్స్‌ ముఠాలను పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోతున్నారు.

ఇదీ చదవండి: రష్యా సైనిక శిక్షణ కేంద్రంపై కాల్పులు.. 11 మంది మృతి

మరిన్ని వార్తలు