కరోనాను నిరోధిస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా!

24 Nov, 2020 06:05 IST|Sakshi

ఫేజ్‌ 3లో సత్ఫలితాలు

లండన్‌: కరోనాను అడ్డుకోవడంలో ఆక్స్‌ఫర్డ్‌ రూపొందించిన టీకా (ChAdOx1  nCoV&19)  మంచి సత్ఫలితాలు ఇస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫేజ్‌3లో ఈ టీకా కోవిడ్‌ నిరోధకతలో మంచి ఫలితాలు చూపిందని, అత్యున్నత రక్షణను ఇస్తోందని తెలిపాయి. ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ రూపొందిస్తున్న ఈ టీకాను ఫేజ్‌ 3 ప్రయోగాల్లో రెండు బ్యాచ్‌లకు ఇచ్చారు. తొలి బ్యాచ్‌లో టీకా 90 శాతం, రెండో బ్యాచ్‌లో 62 శాతం ప్రభావం చూపింది, సగటున వ్యాక్సిన్‌ 70.4 శాతం ప్రభావం చూపినట్లయింది. వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో వైరస్‌ వ్యాప్తి బాగా తగ్గినట్లు గమనించారు. ‘‘ట్రయిల్స్‌ కోసం బ్రిటన్, బ్రెజిల్‌ నుంచి 20వేల మంది వాలంటీర్లను తీసుకున్నారు.

వ్యాక్సిన్‌ను రెండు దశల్లో హై డోసుల్లో ఇచ్చినప్పుడు 62 శాతం ప్రభావమే కనిపించగా, తొలుత తక్కువ డోసు ఇచ్చి అనంతరం రెండోదఫా అధికడోసు ఇచ్చిన కేసుల్లో 90 శాతం ప్రభావం కనిపించిందని, ఎందుకు ఈ తేడా వచ్చిందో ఇంకా తెలియరాలేదని సంస్థ ప్రతినిధులు వివరించారు. తాజా ఫలితాలు కరోనాపై టీకాకు మరింత దగ్గరకు చేర్చాయని ఆక్స్‌ఫర్డ్‌ ప్రొఫిసర్‌ సారా గిల్బర్ట్‌ చెప్పారు. ఎప్పటికప్పుడు ఫలితాలను నియంత్రణా సంస్థలకు అందిస్తామన్నారు. టీకాపై ఇండియా తదితర దేశాల్లో ఇంకా ట్రయిల్స్‌ జరుపుతూనే ఉన్నారు. ఏడాది చివరకు దాదాపు 60 వేల మందిపై టీకా ప్రయోగించాలని భావిస్తున్న ట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. సాధారణ జలుబును కలిగించే వైరస్‌ను బలహీన పరిరచి దాన్ని జన్యుపరంగా మార్చి కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ఉపయోగిస్తున్నారు.  

మరిన్ని వార్తలు