నవంబర్‌లో గిల్గిత్‌ అసెంబ్లీ ఎన్నికలు

25 Sep, 2020 06:47 IST|Sakshi

షెడ్యూల్‌ ప్రకటించిన పాకిస్తాన్‌

తీవ్ర అభ్యంతరం తెలిపిన భారత్‌

ఇస్లామాబాద్‌: నవంబర్‌ 15వ తేదీన గిల్గిత్‌– బాల్టిస్తాన్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరపనున్నట్లు పాకిస్తాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లోని ప్రాంతంలో ఎన్నికలు జరిపేందుకు పాక్‌ చేస్తున్న ప్రయత్నాలపై భారత్‌ తీవ్ర అభ్యంతరం తెలిపింది. సైన్యం ఆక్రమించుకున్న ఆ ప్రాంతంలో ప్రస్తుతమున్న పరిస్థితులను మార్చేందుకు చేసే ఎలాంటి ప్రయత్నం కూడా న్యాయపరంగా చెల్లుబాటు కాదని పేర్కొంది. 2017 ఎన్నికల చట్టం ప్రకారం గిల్గిత్‌– బాల్టిస్తాన్‌ శాసన సభకు నవంబర్‌ 15న ఎన్నికలు జరుగుతాయని పాక్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. అయితే, ఆక్రమించుకున్న ప్రాంతాలపై పాకిస్తాన్‌ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు చెల్లుబాటు కావని భారత్‌ పేర్కొంది. విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ..భారత్‌ అంతరంగిక విషయాలపై మాట్లాడేందుకు పాక్‌కు ఎలాంటి హక్కు లేదన్నారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లతోపాటు గిల్గిత్‌–బాల్టిస్తాన్‌ భారత్‌లో అంతర్భాగంగా ఉన్నాయనీ, ఎప్పటికీ ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం పాక్‌ సీనియర్‌ దౌత్యాధికారికి నోటీసులు జారీ చేసింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు