తాలిబన్‌ ప్రభుత్వ పెద్దలతో... చైనా, రష్యా, పాక్‌ మంతనాలు

23 Sep, 2021 01:21 IST|Sakshi

బీజింగ్‌: చైనా, రష్యా, పాకిస్తాన్‌కు చెందిన ప్రత్యేక రాయబారులు అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్‌ తాత్కాలిక ప్రభుత్వ అత్యున్నత ప్రతినిధులతో సమావేశమయ్యారు. అఫ్గాన్‌ రాజకీయ ప్రముఖులు హమీద్‌ కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లాతోనూ వారు భేటీ అయ్యారు. రాజధాని కాబూల్‌లో ఈ సమావేశాలు జరిగినట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జవో లిజియాన్‌ బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా అఫ్గాన్‌లో సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు, ఉగ్రవాదంపై పోరాటం, ప్రజల పరిస్థితిపై చర్చ జరిగిందని తెలిపారు.

మూడు దేశాల ప్రత్యేక రాయబారులు ఈ నెల 21, 22న అఫ్గాన్‌లో పర్యటించారని, ప్రధానమంత్రి మొహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌తోపాటు పలువురు మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతో చర్చలు జరిపారని పేర్కొన్నారు. ‘అఫ్గాన్‌లోని తాజా పరిణామాలపై మూడు దేశాల ప్రత్యేక రాయబారులతో మా అభిప్రాయాలను పంచుకున్నాం. మా దేశంలో శాంతి, స్థిరత్వం, సమ్మిళిత ప్రభుత్వం కోసం ఇరుగుపొరుగు దేశాలు పొషిస్తున్న పాత్రను స్వాగతిస్తున్నాం’’అని అఫ్గాన్‌ నాయకుడు అబ్దుల్లా అబ్దుల్లా ట్వీట్‌ చేశారు. అఫ్గాన్‌ను గత నెలలో తాలిబన్లు మళ్లీ ఆక్రమించిన తర్వాత హమీద్‌ కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లాను విదేశీ రాయబారులు కలవడం ఇదే మొదటిసారి. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు