జై శ్రీరామ్‌: పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌

6 Aug, 2020 15:49 IST|Sakshi

ఇస్లామాబాద్‌: అయోధ్యలో జరిగిన రామ మందిర భూమి పూజపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రామ మందిర భూమి పూజ గురించి ట్విటర్‌ ద్వారా కనేరియా స్పందించాడు. న్యూయార్క్‌లోని టైమ్‌ స్క్వేర్‌‌లో డిస్‌ప్లే చేసిన  రామమందిరం  ఫోటోను షేర్‌ చేసి దానికి ‘జై శ్రీరామ్‌’ అనే శీర్షికను జోడించాడు. శ్రీరాముడి అందం ఆయన పేరులో కాకుండా వ్యక్తిత్వంలో దాగి ఉందని, శ్రీరాముడు మంచితనానికి, సౌభ్రాతృత్వానికి, ఐకమత్యానికి ప్రతీక అని పేర్కొన్నాడు.  
 

ఎప్పటి నుంచో వివాదంలో ఉన్న అయోధ్యలో రామ మందిర భూమి పూజ జరగడంతో ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఆనందంగా ఉన్నారని కనేరియా తెలిపాడు. పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌లో ఆడిన రెండవ హిందూ క్రికెటర్‌ కనేరియా, అంతకు ముందు అనిల్‌ దల్‌పత్‌ అనే హిందూ బౌలర్‌ 1980 ప్రాంతంలో పాక్‌ జట్టు తరుపున ఆడిన హిందూ క్రికెటర్‌. అనిల్‌ దల్‌పత్‌, కనేరియాకు బంధువు. ఇక రామ మందిరం గురించి కనేరియా వ్యాఖ‍్యలపై ప్రపంచంలో ఉన్న హిందువులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నా, ఆయన అభిమానులు మాత్రం కనేరియా భద్రత విషయం గురించి ఆందోళన చెందుతున్నారు. ఇక మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడటంతో కనేరియాపై జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ... నిషేధాన్ని ఎత్తివేయాలని పాక్ క్రికెట్‌ బోర్డును కోరానని, తాను ఒక హిందువు అయినందునే పీసీబీలో మద్దతు దొరకడం లేదని చెప్పాడు. ఓ పాకిస్తాన్‌ ఆటగాడిపై మూడేళ్ల నిషేధాన్ని పీసీబీ ఇటీవల సగానికి తగ్గించిందని, తన విషయంలో మాత్రం పీసీబీ కఠినంగా వ్యవహరిస్తోందని  డానిష్‌ కనేరియా వాపోయాడు. (గంగూలీని ఆశ్రయిస్తా : పాక్‌ మాజీ క్రికెటర్‌)

చదవండి: అయోధ్య భూమిపూజ: రావణుని గుడిలో వేడుకలు

మరిన్ని వార్తలు