Pakistan: పాకిస్తాన్‌కు కొత్త ముప్పు.. దేశాన్ని చెప్పుచేతల్లోకి తీసుకునే దిశగా తాలిబన్ల పావులు

20 Feb, 2023 05:01 IST|Sakshi

ఆర్థికంగా దివాలా తీశామని ఒకవైపు దేశ రక్షణ మంత్రే ప్రకటిస్తున్న పరిస్థితుల్లో  తెహ్రిక్‌–ఇ–తాలిబన్‌ రూపంలో కొత్త ముప్పుని ఎదుర్కొంటోంది. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నప్పుడు సంబరాలు చేసుకున్న పాకిస్తాన్‌ ఇప్పుడు తాము బలిపశువుగా మారినందుకు ఎలా అడుగు లు వెయ్యాలో తెలీక బిత్తరపోతోంది. ఎవరీ తెహ్రిక్‌–ఇ–తాలిబన్లు, వారి లక్ష్యమేంటి ..?         

2021, ఆగస్టు అఫ్గాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వం ఏర్పాటైన సందర్భం...
పాకిస్తాన్‌లో సంబరాలు జరిగాయి. తమ కనుసన్నల్లో మెలిగిన తాలిబన్లు అమెరికానే తరిమి కొట్టారని, అగ్రరాజ్యంపై ఇస్లాం ఘన విజయం సాధించిందంటూ నాయకులందరూ ప్రకటనలు గుప్పించారు. ఆ నాటి పాక్‌ ఐఎస్‌ఐ చీఫ్‌ ఫయాజ్‌ హమీద్‌ కాబూల్‌కు వెళ్లి తాలిబన్ల ప్రభుత్వ స్థాపనకు స్వయంగా ఏర్పాట్లు చేసి మరీ వచ్చారు.  

నెల రోజులయ్యేసరికి..  
అఫ్గాన్‌లో అధికారంలోకొచ్చిన తాలిబన్ల అండతో తెహ్రిక్‌–ఇ–తాలిబన్‌ పాకిస్తాన్‌ (టీటీపీ) రెచ్చిపోవడం ప్రారంభించింది. పాకిస్తాన్‌ సార్వభౌమాధికారాన్నే ప్రశ్నిస్తూ దాడులకు దిగడం మొదలు పెట్టింది. 2021 ఆగస్టు నుంచి 2022 ఆగస్టు వరకు పాక్‌లో కనీసం 250 దాడులు జరిగాయని పాక్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ పీస్‌ స్టడీస్‌ (పీఐపీఎస్‌) గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. 

అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే దాడుల సంఖ్య రెట్టింపు అయింది. ఈ దాడుల్లో 95శాతం బెలూచిస్తాన్, ఖైబర్‌ పఖ్‌తుఖ్వా(కె.పి)లో కీలక ప్రాంతాలు లక్ష్యంగా జరిగాయి. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకునే దాడులు జరుపుతున్నారు. ఈ ఏడాది జనవరిలో 100 మంది ప్రాణాలను బలితీసుకున్న పెషావర్‌ మసీదు దాడి ఘటన జరిగిన కొద్ది రోజులకే కరాచీలో పోలీసుల్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగడం ఆందోళన కలిగిస్తోంది.  

ఏమిటీ టీటీపీ  
తెహ్రిక్‌–ఇ–తాలిబన్‌ పాకిస్తాన్‌ను టీటీపీ అని పిలుస్తారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల మద్దతుతో వీళ్లు తమ కార్యకలాపాలు నిర్వహిస్తారు. 2001లో అమెరికాపై ట్విన్‌ టవర్స్‌ దాడి తర్వాత అగ్రరాజ్యం చేసిన ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమానికి పాకిస్తాన్‌ అండగా నిలవడంతో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన వీరంతా ఒక గూటి కిందకి చేరారు. పాక్‌ విధానాలను వ్యతిరేకిస్తూ దక్షిణ వజిరిస్తాన్‌లో బైతుల్లా మెహసూద్‌ నేతృత్వంలో 2007లో తెహ్రిక్‌–ఇ–తాలిబన్‌ పాకిస్తాన్‌ (టీటీపీ) ఏర్పాటైంది. టీటీపీ ప్రస్తుత చీఫ్‌ నూర్‌ వలీ మెహసూద్‌ అఫ్గాన్‌ నుంచి పాక్‌లో హింసను రాజేస్తున్నాడు.  

అనుకున్నదొక్కటి అయినదొక్కటి.!
అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరిస్థితులన్నీ తమకు అనుకూలంగా మారిపోతాయని పాక్‌ ప్రభుత్వం భావించింది. రెండు దశాబ్దాల పాటు అఫ్గాన్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు సాయం అందించి అంతర్జాతీయంగా మంచి పేరు సంపాదించుకున్న భారత్‌ ఓ పక్కకి వెళ్లిపోతుందని ఆనందపడింది. అయితే సరిహద్దు రూపంలో తాలిబన్లతో సమస్య మొదలైంది.డ్యూరాండ్‌ రేఖపై ఇరు దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. టీటీపీ తుపాకీలు వదిలి జన జీవన స్రవంతిలోకి రావాలని పాక్‌ సర్కార్‌ చేసిన ప్రయత్నాలు కొనసాగలేదు. సరిహద్దుల్లో ఉన్న గిరిజనుల్ని పాక్‌ చేతుల నుంచి విడిపించడమే తమ లక్ష్యమన్నట్టుగా టీటీపీ మారిపోయింది. అఫ్గానిస్తాన్‌ సరిహద్దుల నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

కొన్నాళ్లు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ పాకిస్తాన్‌ కొత్త ఆర్మీ చీఫ్‌గా గత ఏడాది నవంబర్‌లో జనరల్‌ అసీమ్‌ మునీర్‌ బాధ్యతలు స్వీకరించగానే కాల్పుల విరమణను రద్దు చేసింది. అప్పట్నుంచి పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడులు, ప్రభుత్వ అధికారుల కిడ్నాప్‌లు, బెదిరింపులు వంటివి చేయసాగింది. మరోవైపు పాక్‌ ప్రభుత్వం కూడా తాలిబన్లను అదుపు చేయడానికి దాడులకు దిగుతూ ఉండడంతో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఇన్నాళ్లూ అఫ్గాన్‌లో మంచి తాలిబన్లు, పాక్‌లో ఉన్న టీటీపీ చెడ్డ తాలిబన్లు అని భావించిన పాక్‌కు ఇద్దరూ చేతులు కలపడంతో అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అని నిట్టూరుస్తోంది. ఈ పరిణామాలన్నీ దేశంలో అంతర్యుద్ధానికి దారి తీయవచ్చుననే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.  

దివాలా తీశాం: పాక్‌ రక్షణ మంత్రి
ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతున్న పాకిస్తాన్‌ రేపో మాపో దివాలా తీస్తుందని అందరూ అనుకుంటున్న వేళ ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా అసీఫ్‌ బాంబు లాంటి నిజం చెప్పారు. ఇప్పటికే దేశం దివాలా తీసిందని అన్నారు. ఆదివారం సియాల్‌కోట్‌లో ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ‘‘పాక్‌ దివాలా తీస్తుందన్న వార్తలు మీరు వినే ఉంటారు. వాస్తవానికి ఇప్పటికే దేశం దివాలా తీసింది. మనం ప్రస్తుతం దివాలా తీసిన దేశంలో బతుకుతున్నాం’’ అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. దేశంలో ఆర్థిక సమస్యల పరిష్కారానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ఏమీ చేయలేదని మనమే ఏదో ఒకటి చెయ్యాలన్నారు. పాకిస్తాన్‌లో చట్టం, రాజ్యాంగాన్ని అనుసరించడం లేదని, ఈ దుస్థితికి రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగం, మన వ్యవస్థలు అన్నీ బాధ్యతవహించాలన్నారు.   

టీటీపీ లక్ష్యాలేంటి ?  
పాకిస్తాన్‌ మిలటరీ విధానాలను తీవ్రంగా వ్యతిరేంచిన ఈ సంస్థ దేశాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. 2021లో అఫ్గాన్‌ నుంచి అమెరికా, నాటో దళాలు వెళ్లిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక పాకిస్తాన్‌పై దృష్టి సారించింది. ఇస్లాం విస్తరణ తాలిబన్ల ప్రధాన ధ్యేయంగా మారింది. అఫ్గానిస్తాన్‌లో మాదిరిగా పాకిస్తాన్‌లో కూడా ప్రభుత్వాన్ని కూల్చివేసి ఇస్లామిక్‌ రాజ్యాన్ని స్థాపించి షరియా చట్టాలను కఠినంగా అమలు చేయాలని  ఉవ్విళ్లూరుతోంది. పాకిస్తాన్‌ జైళ్లలో ఉన్న తమ వారిని బయటకు తీసుకురావాలని, అఫ్గాన్, పాక్‌ సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాల్లో పాకిస్తాన్‌ సైనికుల్ని వెనక్కి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలంటూ పాక్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తోంది.  
పాకిస్తాన్‌లో ఉగ్ర దాడులకు ఐసిస్‌ అవసరం లేదు. పాకిస్తానీ తాలిబన్లు చాలు. అఫ్గానిస్తాన్‌ తరహాలో ఏదో ఒకరోజు తాలిబన్లు పాకిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నా ఆశ్చర్యపడాల్సిన పని లేదు.

– తస్లీమా నస్రీన్, బంగ్లాదేశ్‌ రచయిత్రి 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

మరిన్ని వార్తలు