‘పక్కా స్కెచ్‌తో కోర్టులోనే చంపేందుకు కుట్ర..’ వీడియో రిలీజ్‌ చేసిన ఖాన్‌

21 Mar, 2023 14:24 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌.. మరోసారి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలకు దిగారు. కోర్టు హాల్‌లోనే తనను చంపేందుకు కుట్ర పన్నారని, అది అమలు కావడంలో విఫలం కావడంతోనే తాను ప్రాణాలతో ఉండగలిగానని ఆరోపించారాయన. ఈ మేరకు కోర్టు విచారణకు తాను వర్చువల్‌గా హాజరయ్యేందుకు అనుమతించాలంటూ పాక్‌ సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉమర్‌ అ‍ట్టా బందయల్‌కు లేఖ రాశారాయన. 

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తనకు వ్యతిరేకంగా కేసులు నమోదు అయ్యాయని, ఆ ఎఫ్‌ఐఆర్‌లను అన్నింంటిని ఒకచోట చేర్చాలని విజ్ఞప్తి చేశారు ఖాన్‌. అలాగే ప్రాణ హాని నేపథ్యంలో తనను వర్చువల్‌గా కోర్టు విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారాయన. ఇక సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. 

కోర్టు ప్రాంగణంలోనే తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారాయన. ఈ మేరకు ఆయన తన లేఖలో.. ‘‘శనివారం తోషాఖానా గిఫ్ట్‌ కేసుల్లో విచారణకు హాజరుకాగా.. ఇస్లామాబాద్‌ కోర్టు కాంప్లెక్స్‌ బయట నన్ను చంపేందుకు ప్రణాళిక వేశారు. సుమారు 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు నా చుట్టూ చేరారు. వాళ్లు నిఘా సంస్థల్లో పని చేసేవాళ్లుగా అనుమానాలు ఉన్నాయి. వాళ్లే నన్ను చంపేందుకు కుట్రలో భాగం అయ్యారు’’ అని ఆరోపించారాయన. 

ఇక.. కోర్టు కాంప్లెక్స్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేసిన ఆయన.. పోలీస్‌ సిబ్బందే తనను చంపేందుకు కుట్రలో భాగం అయ్యారని, అక్కడ గొడవలు జరుగుతున్నట్లు సృష్టించి తనను చంపేందుకు కుట్ర చేశారని సీజేకి రాసిన లేఖలో ఆరోపించారాయన. 

ఇదిలా ఉంటే.. ఇమ్రాన్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా వందకు పైగా కేసులు నమోదు అయ్యాయి. వాటిలో ఉగ్రవాదం, హత్య, హత్యాయత్నం, దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు యత్నం.. ఇలా రకరాల అభియోగాలు నమోదు అయ్యాయి.

ఇదీ చదవండి: వేడి అలలు.. జీవజాలానికి ఉరితాళ్లు!

మరిన్ని వార్తలు