పాక్‌ మంత్రి సంచలన విజ్ఞప్తి!.. ప్లీజ్‌.. ఛాయ్‌ తాగడం తగ్గించండి

15 Jun, 2022 17:43 IST|Sakshi

Pak import tea on loan: పాకిస్తాన్‌లోని ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దిశగా వెళ్తున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలతో సతమతమవుతున్న పౌరులకు...పాక్‌ స్థానిక మంత్రి ఒకరు తాజాగా ఒక సలహ ఇచ్చారు. టీ వినియోగాన్ని తగ్గించాలని పాక్‌ మంత్రి ప్రజలను కోరారు. టీని కూడా అప్పుగా దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన ప్రజలను టీ తాగడం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

పాక్‌లో  విదేశీ మారక నిల్వలు తగ్గడంతో.. దిగుమతుల బిల్లును తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నగదు కొరతతో సతమతమవుతున్న టీ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలను కోరాడు ఆయన. అదీగాక 2021-22 ఆర్థిక సంవత్సరంలో పాక్‌ సుమారు రూ.2 వేల కోట్ల టీని వినియోగించిందని తేలడంతో పాక్‌ మంత్రి అహ్సాన్‌ ఇక్బాల్‌ ఈ విధంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో టీని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన పాక్‌ టీని దిగుమతి చేసుకోవడానికి కూడా అప్పులు చేయాల్సి వస్తుందని చెప్పారు.

గతేడాది కంటే రూ. 4 వందల కోట్ల టీని పాక్‌ అధికంగా దిగుమతి చేసుకుందని తెలిపారు. ఐతే పాక్‌ మంత్రి చేసిన విజ్ఞప్తి సోషల్‌ మీడియాలో వైరల్‌ అ‍వ్వడంతో ...నెటిజన్లు పాక్‌ ప్రభుత్వ తీరుని, ఆయన్ను విమర్శిస్తూ తమదైన శైలిలో చురకలు అట్టించారు. అంతేకాదు ఆయన గతంలో ఇంధనాన్ని ఆదా చేసేందుకు రాత్రి 8.30 గంటలకు మార్కెట్లను మూసివేయాలని వ్యాపారులను కోరినట్లు ప్రణాళిక మంత్రి తెలిపారు. పైగా ఇది పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి బిల్లును తగ్గించడానికి సహాయపడుతుందని ఇక్బాల్‌ అన్నారు. ఇటీవలే ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ కూడా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ శ్రీలంక ఆర్థిక వ్యవస్థలా మారిపోతుందంటూ హెచ్చరించారు.

(చదవండి: వీడియో: దిగజారిపోతున్న పుతిన్‌ ఆరోగ్యం? వణికిపోతూ.. నిలబడలేక!)

మరిన్ని వార్తలు