చైనా యవ్వారంపై పాక్‌ పీఎంను కడిగేసిన జర్నలిస్ట్‌.. అనవసరంగా కశ్మీర్‌ ప్రస్తావన!

21 Jun, 2021 09:55 IST|Sakshi

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. చైనాపై మరోసారి తన స్వామిభక్తిని ప్రకటించుకున్నాడు. ఫేస్‌ టు ఫేస్‌ ఇంటర్వ్యూలో చైనా తీరుని ఓ జర్నలిస్ట్‌  ఎండగట్టగా.. సమాధానం చెప్పలేక ఇమ్రాన్‌ ఖాన్‌ నీళ్లు నములుతూ దాటవేత ధోరణిని ప్రదర్శించాడు. చైనా మైనారిటీ వర్గం ఉయిగుర్ల ఉచకోతపై డ్రాగన్‌ తీరును తప్పుబట్టకపోగా.. అనవసరంగా కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చి తన వక్రబుద్ధిని చాటుకున్నాడు. 

న్యూయార్క్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను.. హెచ్‌బీవో అక్సియోస్‌ జర్నలిస్ట్‌ జోనాథన్‌ స్వాన్‌ ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో ఇమ్రాన్‌ను ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు చాలానే అడిగాడు స్వాన్‌. ఇక ఇస్లామోఫోబియాకు వ్యతిరేకంగా పోరాడాలని ఇస్లాం స్టేట్‌ నేతలకు కిందటి ఏడాది ఇమ్రాన్‌ లేఖలు రాసిన విషయాన్ని ప్రస్తావించిన స్వాన్‌.. చైనా విషయంలో ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారని నిలదీశాడు. 

‘‘మీ పొరుగున పశ్చిమ చైనాలో అక్కడి ప్రభుత్వం పది లక్షల మందికి పైగా ఉయిగుర్లను బంధించి, హింసిస్తోంది. బలవంతంగా వాళ్లకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయిస్తోంది. క్సింగ్‌జియాంగ్‌లో మసీదుల్ని కూలగొట్టింది. రంజాన్‌ వేళ పవిత్రంగా ఉపవాసం పాటించేవాళ్లను శిక్షించింది. ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో నడుస్తున్న ఇస్లామోఫోబియాను నిలదీసే మీరు.. పొరుగునే ఉన్న చైనాను ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు..ఆధారాలున్నా.. అవకాశాలు దొరుకుతున్న నిలదీయలేక ఎందుకు మౌనంగా ఉంటున్నారు?’ అని అడిగాడు స్వాన్‌.

అయితే ఇది అప్రస్తుతమైన అంశమని, విపత్కర పరిస్థితుల్లో పాక్‌ను ఆదుకున్న చైనాతో తమకు గాఢమైన స్నేహం ఉందని, నాలుగు గోడల మధ్యే ఏ విషయమైనా మాట్లాడుకుంటామని ఇమ్రాన్‌ తెలిపాడు. అయితే ఇది అంత తీవ్రమైన సమస్య కాదని భావిస్తున్నారా? అని స్వాన్‌ అడగ్గానే.. కశ్మీర్‌లో లక్షల మంది భారతీయ సైన్యంలో ఉన్నారని, ఇది అంతకంటే తీవ్రమైన విషయమని విషయాన్ని ట్రాక్‌ తప్పించే ప్రయత్నం చేశాడు. కానీ, స్వాన్‌ మాత్రం వదల్లేదు. ఆధారాలున్నాయని,  అంత స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా పట్టించుకోరా? అని ప్రశ్నించగా.. ఏది ఉన్నా నాలుగు గోడల మధ్యే మాట్లాడుకుంటామని మరోసారి ఉద్ఘాటించి.. విషయాన్ని అక్కడితోనే ముగించాడు  పాక్‌ ప్రధాని.

చదవండి: వికటించిన పాక్‌ మామిడి దౌత్యం!

మరిన్ని వార్తలు