అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించిన ఐక్యరాజ్య సమితి

17 Jan, 2023 10:02 IST|Sakshi

పాకిస్థాన్‌ ఉగ్రవాది విషయంలో ఐక్యరాజ్య సమితి కీలక నిర్ణయం తీసుకుంది. పాక్‌కు చెందిన లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) ఉగ్రవాది అబ్ధుల్‌ రెహ్మన్‌ మక్కీని యూఎన్‌ఓ భద్రతా మండలి గ్లోబల్‌ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. భద్రతా మండలిలోని 1267 ఐఎస్‌ఐల్‌(దయిష్‌), ఆల్‌ ఖైదా ఆంక్షల కమిటీ కింద జనవరి 16న మక్కీని గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ జాబితాలో చేర్చింది.  

ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాక వారి ఆస్తులను స్తంభింపచేయడంతో పాటు ప్రయాణ, ఆయుధాలపై నిషేధం విధించింది. లష్కరే తోయిబా చీఫ్‌, ముంబాయి దాడుల సూత్రధారి అయిన హాఫీజ్‌ సయిద్‌ బావనే రెహ్మాన్‌ మక్కీ. కాగా గతేడాది జూన్‌లో యూఎన్‌ఎస్‌సీ 1267 ఆంక్షల కమిటీ కింద అబ్దుల్‌ రెహ్మాన్‌ మక్కీని గ్లోబల్‌ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని ఐరాసలో భారత్‌ ప్రతిపాదించగా.. భారత్‌ ప్రతిపాదనకు చైనా అడ్డుపడిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే భారత్‌, అమెరికా తమ దేశీయ చట్టాల ప్రకారం మక్కీని ఉగ్రవాది జాబితాలో చేర్చాయి. జమ్మూ కశ్మీర్‌లో ఎల్‌ఈటీ కార్యకలాపాల కోసం నిధుల సేకరణలో మక్కీ కీలక పాత్ర పోషించారు. అంతేగాక.. యువతను హింసకు ప్రోత్సహించడం, దాడులకు కుట్ర పన్నుతున్నాడని వెల్లడైంది. ఈ క్రమంలో తాజాగా అబ్దుల్‌ మక్కీని ఐరాస గ్లోబల్‌ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. 

ఇదిలా ఉండగా 2020వ సంవత్సరంలో పాకిస్థాన్‌ తీవ్రవాద వ్యతిరేక న్యాయస్థానం అబ్దుల్ రెహ్మాన్ మక్కీ ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేశాడన్న కేసులో జైలు శిక్ష విధించింది. అయితే గతంలో కూడా పాకిస్థాన్ ఉగ్రవాదులపై నిషేధం విధించడంలో చైనా అడ్డంకులు సృష్టించింది. యూఎన్ నిషేధించిన పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ జైష్‌-ఎ- మహ్మద్‌ చీఫ్ మౌలానా మసూద్ అజార్‌ను నిషేధించాలన్న ప్రతిపాదనలను డ్రాగన్‌ దేశం పదేపదే అడ్డుకుంది.

మరిన్ని వార్తలు