విమాన సిబ్బందికి ‘లోదుస్తులు’ కంపల్సరీ.. పాక్‌ ఎయిర్‌లైన్స్‌ నవ్వులపాలు, ఆగ్రహజ్వాలలు

30 Sep, 2022 21:10 IST|Sakshi

ఇస్లామాబాద్‌: సొంత దేశంలోనే పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ పరువు పోయింది. విమాన సిబ్బందికి డ్రెస్‌ కోడ్‌లో భాగంగా లోదుస్తులు  తప్పనిసరి అంటూ ఆదేశాలు ఇవ్వడమే అందుకు కారణం. ఈ తరుణంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తగా.. ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది ఎయిర్‌లైన్స్‌.

గురువారం పీఐఏ.. క్యాబిన్‌ సిబ్బంది కోసం ఒక ఆదేశం జారీ చేసింది. యూనిఫాం కింద లోదుస్తులు ధరించడం తప్పనిసరి అని అందులో పేర్కొంది. అంతేకాదు.. అలా వేసుకోకపోవడం వల్ల ఎయిర్‌లైన్స్‌ సేవలపై పేలవమైన ముద్ర పడిపోతుందని, తద్వారా గడ్డుపరిస్థితి ఎదురుకావొచ్చని ఎయిర్‌లైన్స్‌ ఆ ఆదేశాల్లో అభిప్రాయపడింది. లోదుస్తులు వేసుకుంటేనే డిగ్నిటీగా ఉంటుందని పేర్కొంది. ఇంకేం.. 

అక్కడి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఎయిర్‌లైన్స్‌ ఇచ్చింది అసలు అవసరం లేని ఆదేశాలన్నారు చాలామంది. ఎయిర్‌లైన్స్‌పై సొంత దేశంలోనే ట్రోలింగ్‌ కూడా జరిగింది. దీంతో ఆ ఆదేశాలను వెనక్కి తీసేసుకుంది ఎయిర్‌లైన్స్‌. అయితే ఆ విమర్శలు మామూలుగా రాలేదు.  అందుకే ఆ ఆదేశాలపై కచ్చితంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది పీఐఏ. 

డ్రెస్‌ కోడ్‌కు సంబంధించిన ఆదేశాల్లో చిన్న తప్పిదం జరిగిందని, అనవసరమైన పదాల చేరికతోనే ఇలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని పీఐఏ చీఫ్‌ హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ రాతపూర్వక వివరణ ఇచ్చుకున్నారు. ఇక.. జరిగిన ఘటనకు వ్యక్తిగతంగా పశ్చాత్తాపం తెలియజేశారాయన. పీఐఏ పాక్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్‌. రోజూ వందకు పైగా విమానాలు నడిపిస్తోంది. అందులో 18 దేశీయ సర్వీసులు కాగా, 25 అంతర్జాతీయ సర్వీసులు ఉన్నాయి.

ఇదీ చదవండి: రూ. 8 కోట్ల కారు.. నీటిపాలు

మరిన్ని వార్తలు