భారత ఆర్మీతో పోలికా! అంత సీన్‌ లేదు..  కుండ బద్దలు కొట్టిన పాక్‌ ఆర్మీ మాజీ చీఫ్‌

25 Apr, 2023 18:12 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్‌ కమర్ జావెద్ బద్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత సైన్యం సత్తాపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. భారత్ సైన్యంతో పారాడే శక్తి సామర్థ్యాలు, ఆయుధ సంపత్తి పాకిస్తాన్‌ ఆర్మీకి లేదని కుండబద్దలు కొట్టారు. బ్రిటన్‌లోని పాకిస్తాన్ మీడియా జర్నలిస్టులు హమీద్ మీర్, నజీం జెహ్రాలకు ఇచ్చిన ఇంటర్వూలో జావెద్ ఈ వాఖ్యలు చేశారు.

'భారత ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీ సరితూగలేదు. భారత్‌తో పాక్ యుద్ధం చేసే పరిస్థితి లేదు. ట్యాంకులు కూడా పనిచేయడం లేదు. ఫిరంగులను తరలించడానికి డీజిల్ కూడా లేదు' అని బజ్వా తెలిపారు. పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు ఆ దేశ సైనిక సామర్థ్యాలపై ప్రశ్నలు లేవెనత్తేలా, సైన్యం నైతికతను దెబ్బతీసేలా ఉన్నాయి. ఏదేమైనా ఆయన చెప్పిన దాంట్లో మాత్రం వాస్తవం ఉంది. భారత సైన్యం వీరపరక్రమాల ముందు పాక్ సైన్యం సరితూగదని జగమెరిగిన సత్యం.

పాకిస్తాన్ కమాండర్స్ సదస్సులోనే బజ్వా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. భారత్‌తో పాకిస్తాన్ శుత్రుత్వం పెంచుకోకుండా స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపరుచుకుంటేనే మంచిదని ఆయన అన్నారు. భారత్‌తో సుదీర్ఘ విరోధం పాకిస్తాన్‌ను హరించివేస్తుందని పేర్కొన్నారు. భారత్‌తో పోరాడేందుకు అవసరమైన ఆయుద సంపద, ఆర్థిక బలం పాకిస్తాన్‌కు లేవని, అందుకే కశ్మీర్ సమస్యపై ఇరుదేశాలు శాశ్వత పరిష్కారానికి వచ్చే విషయంపై ఆలోచిస్తున్నట్లు కూడా బజ్వా పేర్కొన్నారు.

ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ సంక్షోభంతో ప్రజల జీవితాలు దుర్బరంగా మారాయి. నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చి, ఉద్యోగాలు పోయి అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు.
చదవండి: సూడాన్‌ ఆర్మీ-పారామిలిటరీ బలగాల పోరు.. 72 గంటలపాటు కాల్పుల విరమణ!

మరిన్ని వార్తలు