డిప్యూటీ స్పీకర్‌పై దాడి.. జుట్టు పట్టుకుని లాగుతూ.. వీడియో వైరల్‌

16 Apr, 2022 17:28 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మాణం సందర్భంగా ఆ దేశ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 

ఇదిలా ఉండగా.. శనివారం పాక్‌ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.  లాహోర్‌ కోర్టు ఆదేశాల మేరకు కొత్త సీఎంను ఎన్నుకునేందుకు పంజాబ్‌ అసెంబ్లీ శనివారం సమావేశమైంది. ఈ సందర్భంగా సభ జరుగుతున్న క్రమంలో.. పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్‌ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యులు బీభత్సం సృష్టించారు. గట్టిగా అరుస్తూ డిప్యూటీ స్పీకర్‌ దోస్త్ మహ్మద్ మజారీపై వారు దాడి దిగారు. ఆయనపైకి పువ్వులు విసురుతూ, జుట్టు పట్టుకుని లాగుతూ, చెంపపై కొడుతూ దాడి చేశారు. ఆ సమయంలో పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డులు కూడా వీరిని నిలువరించలేకపోయారు.

ఈ సందర్భంలో పీటీఐ, పీఎంఎల్‌క్యూ సభ్యులు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాడి నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్‌ దోస్త్ మహ్మద్ మజారీ సెక్యూరిటీ గార్డుల రక్షణలో సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం సభలో చోటుచేసుకున్న పరిణామాలపై విపక్ష పార్టీలు మండిపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

మరిన్ని వార్తలు