వికిపీడియాను బ్యాన్ చేసిన పాకిస్తాన్.. ఎందుకంటే..?

4 Feb, 2023 15:53 IST|Sakshi

ఇస్లామాబాద్‌: ప్రముఖ వెబ్‌సైట్ వికిపీడియాను బ్యాన్ చేసింది పాకిస్తాన్. తాము చెప్పిన కంటెంట్‌ను తొలగించనందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మతాన్ని అగౌరపరిచేలా ఉన్న కంటెంట్‌ను పూర్తిగా తొలగించాలని 48 గంటలు గడువు ఇచ్చినా వికిపీడియా నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పాక్ టెలికం శాఖ ఈమేరకు చర్యలు తీసుకుంది.

సామాజిక మాధ్యమాలు, వెబ్‌సైట్లను బ్యాన్ చేయడం పాకిస్తాన్‍లో తరచూ జరగుతూనే ఉంది. 2012లో ఏకంగా 700 యూట్యూబ్ లింకులను బ్లాక్ చేసింది. ఇస్లాంకు వ్యతిరేకంగా కంటెంట్ ఉందని ఆరోపిస్తూ ఈ చర్యలు తీసుకుంది. పాక్ తీరుపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.

తాజాగా వికిపీడియా కూడా ఈ జాబితాలో చేరింది. మతానికి సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలని ఆ సంస్థకు పాక్ ప్రభుత్వం నోటీసులు పంపింది. తమ ఆదేశాలు పాటించకపోతే వెబ్‌సైట్‍ను బ్లాక్ చేస్తామని హెచ్చరించింది. అయినా వికిపీడియా నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో వెబ్సైట్‌ను బ్లాక్ చేసింది పాక్ ప్రభుత్వం.

అయితే పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని పులువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బ్యాన్ చేయడం రాజ్యాంగ విరుద్దమని, సరైన నిర్ణయం కాదని విమర్శిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు, పరిశోధకులు, సమాజంలోని వర్గాలపై ప్రభావం పడుతుందని డిజిటల్ హక్కుల కారకర్త ఉసామా ఖిల్జీ అన్నారు.

మరోవైపు వికిపీడియా సంస్థ కూడా దీనిపై స్పందించింది. తమ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రపంచంలోనే అతిపెద్ద జ్ఞాన సంపదను పాక్ ప్రజలు కోల్పోతారని, దేశ సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాల గురించి తెలుసుకునే అవకాశం ప్రజలకు ఉండదని పేర్కొంది.
చదవండి: కార్చిచ్చు బీభత్సం.. వందల ఇళ్లు ధ్వంసం.. 13 మంది మృతి..

మరిన్ని వార్తలు