చైనా జెట్‌ విమానాలు కొన్న పాక్‌

31 Dec, 2021 05:59 IST|Sakshi

ఇస్లామాబాద్‌: చైనా తయారీ జే–10సీ జెట్‌ విమానాల ఫుల్‌ స్క్వాడ్రన్‌ (25 విమానాలు)ను పాకిస్థాన్‌ కొనుగోలు చేసింది. ఇండియా ఇటీవల జరిపిన రఫేల్‌ విమానాల కొనుగోలుకు బదులుగా చైనా జెట్లను కొన్నామని పాక్‌ మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ చెప్పారు. అన్ని రకాల వాతావరణాల్లో ప్రయాణం చేయగల ఈ జెట్‌ విమానాలు వచ్చే ఏడాది మార్చి 23న పాకిస్తాన్‌ డే రోజున కవాతులో పాల్గొంటాయని చెప్పారు. గతేడాది పాక్, చైనా సంయుక్త విన్యాసాల్లో ఈ జెట్లు పాల్గొన్నాయి.

ప్రస్తుతం పాక్‌ వద్ద యూఎస్‌ తయారీ ఎఫ్‌–16 విమానాలున్నాయి. ఇవి రఫేల్‌కు దీటు రాగలవని నిపుణుల అంచనా. అయితే వీటికన్నా మరింత మెరుగైన జెట్లను సిద్ధంగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో పాక్‌ తాజాగా చైనా జెట్లను కొనుగోలు చేసింది. వీటి ఖరీదు ఒక్కోటి సుమారు 3.5 కోట్ల డాలర్లు. అయితే రఫేల్‌ను ఎదుర్కొనేందుకు ఎఫ్‌ 16 విమానాలుండగా ఇప్పుడీ జెట్లను ఎందుకు కొన్నారో తెలియదని, రఫేల్‌తో పోలిస్తే ఇవేమంత గొప్పవి కావని పాక్‌ రక్షణ నిపుణుడు, సెనేటర్‌ అఫ్నాన్‌ ఉల్లా ఖాన్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు