పాకిస్తాన్‌ రూపాయి రికార్డు స్థాయిలో పతనం.. లంకను మించిన పరిస్థితులు!

27 Jan, 2023 08:48 IST|Sakshi

ఇస్లామాబాద్‌: దాయాది దేశంలో పాకిస్తాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్తాన్‌ కరెన్సీ(రూపాయి) విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. రూపాయి విలువ గురువారం డాలర్‌కు 255 రూపాయలకు పడిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కేవలం ఒక్కరోజులోనే 24 రూపాయలు పతనమైనట్లు తెలిపాయి. ఇక, బుధవారం పాక్‌ కరెన్సీ విలువ రూ. 230.89‌గా ఉండగా.. అది గురువారానికి రికార్డు స్థాయిలో పతనమైంది. 

అయితే, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కెందుకు పాక్‌ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే కరెన్సీ మారకపు రేటు నిబంధనలను మరింత సరళతరం చేసింది. దీంతో, కరెన్సీ విలువ ఒక్కసారిగా పడిపోయింది. మరోవైపు.. కరెన్సీపై పాక్‌ ప్రభుత్వం నియంత్రణలను సరళీకరించాలని, రూపాయి మారకపు విలువను మార్కెట్‌ నిర్ణయించేలా చూడాలని ఐఎంఎఫ్‌(అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) పాకిస్తాన్‌ను కోరింది. ఈ క్రమంలోనే ఐఎంఎఫ్‌ వద్ద ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 6.5 బిలియన్‌ డాలర్ల నిధుల విడుదలకు ఆమోదం తెలుపుతుందనే ఉద్దేశంతో పాకిస్తాన్‌ వెంటనే ఈ నిబంధనకు అంగీకారం తెలిపింది. 

ఇదిలా ఉండగా.. 2019లోనే పాకిస్తాన్‌కు సాయం అందించేందుకు ఐఎంఎఫ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కానీ, 6.5 బిలియన్‌ డాలర్ల సాయం విషయంలో కొన్ని షరతులు విధించింది. పాక్‌కు నిధులు ఇవ్వాలంంటే కరెంట్స్‌ సబ్సిడీలను ఉపసహరించుకోవాలని ఐఎంఎఫ్‌ సూచించింది. అలాగే, పాక్‌ రూపాయి మారక విలువను మార్కెట్‌ ఆధారంగా నిర్ణయించాలనీ, లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్లపై నిషేధం తొలగించాలని ఐఎంఎఫ్‌ కండీషన్స్‌ పెట్టింది. అయితే, ఈ షరతులకు అప్పటో పాకిస్తాన్‌ ఒప్పుకోలేదు. దీంతో,  ఆర్థిక సాయం నిలిచింది. తాజా పరిస్థితుల్లో ఆర్థిక సాయం తప్పనిసరి కావడంతో పాక్‌ ఐఎంఎఫ్‌ షరతులకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. 

తాజాగా ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్తాన్‌లో పలు ప్రాంతాల్లో ఇప్పటికే విద్యుత్ సంక్షోభం నెలకొనగా, ఆహార ధాన్యాల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒక ప్యాకెట్‌ పిండి రూ.3వేల కంటే ఎక్కువ ధర పలుకుతోంది. అంతే కాకుండా పాకిస్తానీలు ఆహార ట్రక్కుల వెంట పరుగులు తీస్తున్న వీడియోలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి.  విదేశీ మారక నిల్వల తగ్గిపోవడంతో ఇంధన కొరతకు దారి తీసింది. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద దారి పొడవునా వాహనదారులు బారులుతీరారు. 

పొదుపు చర్యలే శరణమంటున్న పాక్‌ 
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్‌ పొదుపు చర్యలపై దృష్టి పెట్టింది. ఎంపీల వేతనాల్లో 15 శాతం కోత పెట్టింది. వారి విదేశీ పర్యటనలు, లగ్జరీ వాహనాల కొనుగోలుపై నిషేధం విధించింది. గ్యాస్, విద్యుత్‌ ధరలు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. నిఘా సంస్థలకు విచ్చలవిడిగా నిధులు విడుదల చేయరాదని తీర్మానించింది. చమురు దిగుమతులు గుదిబండగా మారిన నేపథ్యంలో అన్ని స్ధాయిల్లో పెట్రోల్‌ వాడకాన్ని 30 శాతం తగ్గించుకోవాలని నిర్ణయానికొచ్చింది.

మరిన్ని వార్తలు