Pakistan economic crisis: నిత్యావసరాలకూ కటకట

8 Jan, 2023 06:09 IST|Sakshi

పాకిస్తాన్‌లో అల్లాడుతున్న జనం

గోధుమపిండికి తీవ్ర కొరత

నూనె, నెయ్యి ధరలు చుక్కల్లో

లాహోర్‌: పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం అంతకంతకూ తీవ్రతరమవుతోంది. ఏమీ కొనేటట్టు లేదు, ఏమి తినేటట్టు లేదు, కొందామన్నా ఏమీ దొరికేటట్టు లేదు అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయి. తినే తిండికి కూడా కొరత ఏర్పడుతోంది. ప్రజలకు ప్రధాన ఆహారమైన గోధుమ పిండి లాహోర్‌లో దొరకడం లేదు. దీంతో ప్రజలు ఎనలేని ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారు. విదేశీ నిల్వలు తరిగిపోవడం,  నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. పంచదార, నూనె, నెయ్యి వంటి ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు.

15 కేజీల గోధుమ పిండి బ్యాగ్‌ ఖరీదు రూ.2,050గా ఉంది. దేశవ్యాప్తంగా గోధుమపిండి, పంచదార, నెయ్యి,  ధరలు 25 నుంచి 62 శాతం పెరిగాయి. నిత్యావసరాలపై సబ్సిడీలన్నీ ఎత్తేయడంతో ప్రజలపై ధరల పిడుగు పడింది. ద్రవ్యోల్బణం రేటు వారానికి 1.09 % చొప్పున పెరుగుతోంది! పాకిస్తానీలు వినియోగించే వంటనూనెలో 90 శాతం దిగుమతుల ద్వారా లభిస్తోంది. విదేశీ మారక నిల్వలు  కేవలం మూడు వారాలకు సరిపడా మాత్రమే ఉండటంతో వంటనూనెను అత్యవసరాల జాబితా నుంచి తొలగించారు. మార్చిలో రంజాన్‌ మాసం ప్రారంభమవుతున్నందున నెయ్యి, నూనెల సరఫరాను చక్కదిద్దాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

పడిపోతున్న రూపాయి విలువ
అప్పుల కుప్పగా మారిపోయిన పాకిస్తాన్‌లో రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తోంది. డాలర్‌తో పోలిస్తే పాక్‌ రూపాయి 227కు పడిపోయింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 550 కోట్ల డాలర్లకు పరిమితమై ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయికి చేరాయి. పరిస్థితి ఆందోళనకరమేనని ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌ అంగీకరించారు. ఒక రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడిదారుల సమావేశంలో మాట్లాడిన ఆయన ‘‘పాకిస్తాన్‌ ప్రభుత్వం ఆర్థికంగా చాలా సంక్షోభంలో ఉంది. 2016లో ప్రభుత్వం మాకు అప్పగించినప్పడు విదేశీ ద్రవ్య నిల్వలు 2,400 బిలియన్‌ డాలర్లు ఉండేవి. ఇప్పుడు అవి కూడా మా దగ్గర లేవు. కానీ ఈ తప్పు నాది కాదు. వ్యవస్థది’’ అని ఆయన చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 3 శాతం కంటే తక్కువగా వృద్ధి రేటు ఉంటుందనే అంచనాలున్నాయి.
 

మరిన్ని వార్తలు