‘తప్పట్లేదు.. బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణం, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో బస వద్దు’

25 Feb, 2023 15:18 IST|Sakshi

గత కొంత కాలంగా పాకిస్తాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఆ దేశ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు కఠిన నిర్ణయాలను తీసుకుంటోంది పాక్‌. ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం తన పొదుపు చర్యల్లో భాగంగా తమ మంత్రులు ఇకపై 5-స్టార్ హోటళ్లలో బస, బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం చేయవద్దని స్పష్టం చేసింది.

కీలక ని​ర్ణయం.. అవి బంద్‌
ఇస్లామాబాద్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో షరీఫ్ మాట్లాడుతూ.. ‘మనం సమయానుకూలంగా నడుచుకోవాలి. కాలం మన నుంచి ఏమి కోరుతుందో వాటిని ఇవ్వాల్సి ఉంటుందని’ షరీఫ్ అన్నారు. పెరుగుతున్న అప్పులు, ప్రపంచ ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరతల కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చాలా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు గతంలో ప్రభుత్వం తన ఉద్యోగుల జీతాలను తగ్గించడంతో పాటు సమాఖ్య మంత్రుల సంఖ్యను మరింత తగ్గించింది. వీటితో పాటు మంత్రిత్వ శాఖలు, విభాగాల ఖర్చులను చాలా వరకు అరికట్టింది. దీంతోపాటు లగ్జరీ వస్తువులు, కార్ల కొనుగోలుపై కూడా వచ్చే ఏడాది వరకు పాక్‌ ప్రభుత్వం నిషేధం కూడా విధించింది.

అంతేకాకుండా ప్రభుత్వం ఖర్చు తగ్గించే చర్యలలో $764 మిలియన్ల ప్రణాళికను కూడా పాటిస్తోంది. తద్వారా ఐఎంఎఫ్‌ నుంచి నిధులు పొందాలనే ఆలోచనలో ఉంది. సబ్సిడీలను తొలగించాలని ఐఎంఎఫ్‌ చేసిన అభ్యర్థనను అనుసరించి, పాకిస్తాన్ లగ్జరీ దిగుమతులపై సుంకాలను పెంచింది. ఇంధన ధరలను పెంచడంతో పాటు ఈ వారం ప్రారంభంలో కరెన్సీని తగ్గించింది. అదనంగా, ఐఎంఎఫ్‌ మార్కెట్ నిర్ణయించిన కరెన్సీ రేటును అనుమతించాలని సూచించింది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం దెబ్బకు అటు సామాన్యులను మాత్రమే కాకుండా సైన్యాన్ని కూడా ప్రభావితం చేసింది. సరఫరాలో కోత కారణంగా పాకిస్తాన్ సైన్యం మెస్‌లలో ఆహార కొరత సమస్యలను ఎదుర్కొంటోంది.

చదవండి : 'పుతిన్‌కు నెక్ట్స్ బర్త్‌డే లేదు.. ఏడాది కూడా బతకడు..!'

మరిన్ని వార్తలు