టెర్రరిజం కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌కు ముందస్తు బెయిల్‌

23 Aug, 2022 06:30 IST|Sakshi

ఇస్లామాబాద్‌: టెర్రరిజం కేసులో పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఇ–ఇన్సాఫ్‌(పీటీఐ) చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌కు కొంత ఊరట లభించింది. ఆయనకు మూడు రోజులపాటు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఇస్లామాబాద్‌ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత వారం రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ ర్యాలీలో ఇమ్రాన్‌ ప్రసంగించారు. పోలీసులను, న్యాయ వ్యవస్థను, ప్రభుత్వ వ్యవస్థలను దూషిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

దీంతో పోలీసులు ఆయనపై యాంటీ టెర్రరిజం యాక్ట్‌ కింద కేసు పెట్టారు. దీనిపై ఆయన  ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ మొహిసిన్‌ అక్తర్‌ కయానీ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది.  ప్రభు త్వం ఉద్దేశపూర్వకంగానే ఇమ్రాన్‌ను వేధిస్తోందని ఆయన తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇమ్రాన్‌కు బెయిల్‌ ఇవ్వాలని కోరారు. దీంతో ముందస్తు బెయిల్‌ ఇస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు