Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం!

2 May, 2022 18:05 IST|Sakshi

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇమ్రాన్ అరెస్ట్‌కు దాదాపుగా రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఇమ్రాన్‌ సౌదీ అరేబియాలో ఈద్‌ ప్రార్ధనల్లో ఉన్నారు. అది ముగిసిన అనంతరం ఆయన్ను అరెస్ట్ చేస్తారంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. సౌదీ అరేబియాలోని మదీనాలో పాక్‌ ప్రస్తుత ప్రధానమంత్రి షాబాజ్‌ షరీఫ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఘటనలో ఇమ్రాన్‌పై పోలీసులు దైవదూషణ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే ఆయన్ను ఏ క్షణమైనా అరెస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నాయని పాక్‌ మీడియా పేర్కొంది. పాక్ హోం మంత్రి రాణా స‌న‌వుల్లాకు సంబంధించిన మీడియా రిపోర్టుల్లో కూడా ఈ విష‌యాన్ని స్ప‌ష్టంగా పేర్కొన్నారు.

కాగా సౌదీ అరేబియాలోని మదినాలో ప్రార్థ‌నా మందిరం ద‌గ్గ‌ర గత గురువారం పాక్‌ కొత్త ప్ర‌ధాని షాహ‌బాజ్‌, అతని ప్రతినిధుల బృందానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారని ఇమ్రాన్‌ ఖాన్‌పై కేసు నమోదైంది. ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతుదారులు పాక్ ప్ర‌ధాని షాబాజ్‌ను ఉద్దేశించి దొంగ‌.. ద్రోహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ వీడియోల ఆధారంగా పాకిస్థాన్‌లో పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు ఇక మాజీ మంత్రులు ఫ‌వాద్ చౌద‌రి, షేక్ ర‌షీద్‌, ప్రధాని మాజీ సలహాదారు షాబాజ్ గుల్‌తో స‌హా 150 మంది ఉన్నారు.
చదవండి: తక్కువ అంచనా వేశారు.. రష్యన్‌ బోట్లను పేల్చేశాం: ఉక్రెయిన్‌

మరిన్ని వార్తలు