పాకిస్తాన్‌ వరద బాధితులుగా... 1.6 కోట్ల చిన్నారులు!

18 Sep, 2022 05:40 IST|Sakshi

34 లక్షల మందికి తక్షణమే సాయం కావాలి: యునిసెఫ్‌

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో సంభవించిన భీకర వరదల ధాటికి 1.6 కోట్ల మంది చిన్నారులు బాధితులుగా మారారని, వీరిలో 34 లక్షల మందికి తక్షణమే సాయం అందించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. ఇప్పటికే పోషకాహార లేమిని ఎదుర్కొంటున్న బాలలు డయేరియా, డెంగ్యూ జ్వరం, చర్మ వ్యాధులతో పోరాడుతున్నారని తెలియజేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి(యునిసెఫ్‌) ప్రతినిధి అబ్దుల్లా ఫాదిల్‌ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

పాకిస్తాన్‌లో సింధ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఇటీవలే రెండు రోజులపాటు పర్యటించారు. పాకిస్తాన్‌లో వరదలు 528 మంది చిన్నారులను పొట్టనపెట్టుకున్నాయని చెప్పారు. ఇవన్నీ నివారించగలిగే మరణాలే అయినప్పటికీ ప్రభుత్వం ఆ పని చేయలేకపోయిందని ఆక్షేపించారు. ఆవాసం లేక చిన్నపిల్లలు కుటుంబాలతో కలిసి బహిరంగ ప్రదేశాల్లోనే ఉంటున్నారని, ఆహారం, నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు కూలిపోయాయని అన్నారు. బాధితులను ఆదుకొనేందుకు అంతర్జాతీయ సమాజం తక్షణం ముందుకు రావాలని అబ్దుల్లా ఫాదిల్‌ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు