పాకిస్తాన్‌లో ఆహార సంక్షోభం 

11 Jan, 2023 03:10 IST|Sakshi
ఇస్లామాబాద్‌లో సబ్సిడీ గోధుమ పిండి కోసం బారులు తీరిన ప్రజలు  

రాయితీ గోధుమ పిండి కోసం జనం పడిగాపులు  

మార్కెట్లలో తొక్కిసలాటలు  

ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు  

ఏడాదిలోనే 501 శాతం పెరిగిన ఉల్లి ధర  

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం మరింత ముదురుతోంది. ఆహార సంక్షోభం సైతం మొదలయ్యింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రధానంగా గోధుమ పిండి కొరత వేధిస్తోంది. రాయితీపై ప్రభుత్వం అందించే గోధుమ పిండి కోసం జనం ఎగబడుతున్నారు. ఖైబర్‌ పఖ్తూంక్వా, సింధ్, బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాట, తోపులాట దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పిండి కోసం తరలివచి్చన జనంతో మార్కెట్లు నిండిపోయాయి. మార్కెట్లలో రాయితీ గోధుమ పిండి కోసం జనం గంటల తరబడి వరుసల్లో నిలబడాల్సి వస్తోంది. నిత్యం వేలాది మంది వస్తున్నారని స్థానిక మీడియా వెల్లడించింది.  

కిలో గోధుమ పిండి రూ.160  
పాకిస్తాన్‌ ప్రధాన ఆహారమైన గోధుమలు, గోధుమ పిండి ధర విపరీతంగా పెరిగిపోయింది. కరాచీలో కిలో పిండి ధర రూ.160కు చేరింది. ఇస్లామాబాద్, పెషావర్‌లో 10 కిలోల గోధుమ పిండి బ్యాగ్‌ను రూ.1,500కు విక్రయిస్తున్నారు. 15 కిలోల బ్యాగ్‌ ధర రూ.2,050 పలుకుతోంది. గత రెండు వారాల వ్యవధిలోనే ధర రూ.300 పెరిగింది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారడం ఖాయమన్న సంకేతాలను బలూచిస్తాన్‌ ఆహార మంత్రి జమారక్‌ అచాక్‌జాయ్‌ ఇచ్చారు. గోధుమ నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యానని చెప్పారు. ఆహార శాఖ, పిండి మిల్లుల నడుమ సమన్వయ లోపమే కొరతకు కారణమని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.  

కరిగిపోతున్న విదేశీ మారక నిల్వలు  
పాకిస్తాన్‌ను ద్రవ్యోల్బణం హడలెత్తిస్తోంది. గత ఏడాది సంభవించిన భీకర వరదల వల్ల కష్టాలు మరింత పెరిగాయి. కేవలం గోధుమలే కాదు ఉల్లిపాయలు, తృణధాన్యాలు, బియ్యం ధరలు సైతం పైకి ఎగబాకుతున్నాయి. కిలో ఉల్లిపాయల ధర 2022 జనవరి 6న రూ.36.7 కాగా, 2023 జనవరి 5 నాటికి ఏకంగా రూ.220.4కు చేరింది. అంటే ఏడాది వ్యవధిలోనే 501 శాతం పెరిగింది.

అలాగే డీజిల్‌ ధర 61 శాతం, పెట్రోల్‌ ధర 48 శాతం పెరిగింది. బియ్యం, తృణధాన్యాలు, గోధుమల ధర 50 శాతం ఎగబాకింది. 2021 డిసెంబర్‌లో పాక్‌ ద్రవ్యోల్బణం 12.3 శాతం కాగా, 2022 డిసెంబర్‌లో 24.5 శాతం నమోదయ్యింది. ఆహార ద్రవ్యోల్బణం ఒక ఏడాదిలోనే 11.7 శాతం నుంచి 32.7 శాతానికి చేరింది. పాకిస్తాన్‌లో విదేశీ మారక నిల్వలు వేగంగా అడుగంటుతున్నాయి. 2021 డిసెంబర్‌లో 23.9 బిలియన్‌ డాలర్లు ఉండగా, 2022 డిసెంబర్‌లో కేవలం 11.4 బిలియన్‌ డాలర్లు ఉన్నాయి.  

రష్యా గోధుమల దిగుమతి  
రష్యా నుంచి గోధుమలు పాకిస్తాన్‌కు చేరుకోవడం కొంత ఊరట కలిగిస్తోంది. రెండు ఓడల్లో వేలాది టన్నుల గోధుమలు తాజాగా కరాచీ రేవుకు చేరుకున్నాయి. అదనంగా 4,50,000 టన్నులు రష్యా నుంచి గ్వాదర్‌ పోర్టు ద్వారా త్వరలో రానున్నాయని పాక్‌ అధికారులు వెల్లడించారు. గోధుమల కొరతను అధిగమించడానికి వివిధ దేశాల నుంచి 75 లక్షల టన్నులు దిగుమతి చేసుకోవాలని పాక్‌ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం సరుకు ఈ ఏడాది మార్చి 30 నాటికి పాకిస్తాన్‌కు చేరుకుంటుందని అంచనా. 

మరిన్ని వార్తలు