కశ్మీర్‌పై డ్రాగన్‌ మద్దతు కోసం పాక్‌ పావులు

20 Aug, 2020 14:54 IST|Sakshi

బీజింగ్‌కు పాక్‌ విదేశాంగ మంత్రి

ఇస్లామాబాద్‌ : చైనాతో వ్యూహాత్మక సంబంధాల కోసం అర్రులుచాస్తున్న పాకిస్తాన్‌ ఆ దిశగా పావులు కదుపుతోంది. పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి మక్దూమ్‌ షా మహ్మద్‌ ఖురేషి చైనాతో వ్యూహాత్మక సంప్రదింపుల కోసం బుధవారం బీజింగ్‌ బయలుదేరారు. పాకిస్తాన్‌కు అన్ని వేళలా రాజకీయంగా బాసటగా నిలిచిన చైనానే తమకు నిజమైన మిత్రదేశమని ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఖురేషి చైనా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. బీజింగ్‌లో ఖురేషి చైనా విదేశాంగ మంత్రి సహా దౌత్యవేత్తలతో సంప్రదింపులు జరుపుతారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పాకిస్తాన్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పర్యటన ఏర్పాట్లపై ఖురేషి చైనా విదేశాంగ మంత్రితో చర్చిస్తారు.

కశ్మీర్‌పై పాక్‌ వైఖరికి చైనా తోడ్పాటును కోరడంతో పాటు తూర్పు లడఖ్‌లో ఇండో-చైనా ప్రతిష్టంభనపైనా ఖురేషి తన పర్యటనలో చైనాతో చర్చించనున్నారు. సౌదీఅరేబియాతో పాకిస్తాన్‌ సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో పాక్‌ చైనా వైపు చూస్తున్నట్టు పలు కథనాలు వచ్చాయి. అయితే సౌదీతో తమ సంబంధాలు బెడిసికొట్టలేదని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. మరోవైపు చైనాతో సంబంధాల ప్రాధాన్యతను ఆయన ఇదే ఇంటర్వ్యూలో నొక్కిచెప్పారు. ‘మా భవిష్యత్‌ చైనాతోనే ముడిపడి ఉంది..పాకిస్తాన్‌ తోడ్పాటు కూడా చైనాకు అంతే అవసరమ’ ఇమ్రాన్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు 2018లో తాము ఇచ్చిన 3 బిలియన్‌ డాలర్ల రుణంలో 1 బిలియన్‌ డాలర్లను తక్షణమే చెల్లించాలని సౌదీ అరేబియా పాకిస్తాన్‌ను కోరినప్పటి నుంచి ఇస్లామాబాద్‌ డ్రాగన్‌ వైపు దృష్టి సారించింది. చదవండి : చైనాలో మసీదుల కూల్చివేత.. మౌనం వీడని పాక్‌!

కశ్మీర్‌ అంశంపై చర్చించేందుకు ఇస్లామిక్‌ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఏర్పాటునకు రియాద్‌ నిరాకరించడంతో ఖురేషి చేసిన ఘాటు వ్యాఖ్యలపై పాక్‌ ఇంటా బయటా వివాదం నెలకొంది. సౌదీతో సంబంధాలు దెబ్బతినకుండా పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బాజ్వా సౌదీ అరేబియా సందర్శించాల్సి వచ్చింది. సౌదీ అరేబియా చొరవ చూపకుంటే కశ్మీర్‌పై ఇతర ముస్లిం దేశాలను సంప్రదిస్తామని ఖురేషి చేసిన వ్యాఖ్యలు సౌదీకి ఆగ్రహం కలిగించాయి.

>
మరిన్ని వార్తలు