Pakistan: పాక్‌లో మాజీ ప్రధానుల అరెస్ట్‌ ఎందుకు?

27 Sep, 2023 08:14 IST|Sakshi

గత నెలలో పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు తోషాఖానా కేసులో మూడేళ్ల జైలు శిక్ష విధించారు. దీనితోపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఐదేళ్ల పాటు నిషేధం కూడా విధించారు. తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ను మూడు నెలల్లోనే రెండుసార్లు అరెస్టు చేశారు.

పాకిస్తాన్‌లో మాజీ ప్రధానిని అరెస్టు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా పలువురు మాజీ ప్రధానులు అరెస్టయ్యారు. 1947లో పాకిస్తాన్ ఏర్పడిన కొద్దికాలానికే ఈ ధోరణి మొదలై, నేటికీ కొనసాగుతోంది. పాకిస్తాన్ చాలా కాలంగా సైనిక పాలనను చవిచూస్తోంది. పాక్‌లో రాజకీయ సంక్షోభం అనేది కొత్తేమీ కాదు. పాక్‌లో మాజీ ప్రధాన మంత్రుల అరెస్టు 60లలోనే మొదలయ్యింది.

హుస్సేన్ షహీద్ సుహ్రావర్ది 
హుస్సేన్ షహీద్ సుహ్రవర్ది (సెప్టెంబర్ 1956-అక్టోబర్ 1957) పాక్‌ ఐదవ ప్రధానమంత్రి. జనరల్ అయూబ్ ఖాన్ ప్రభుత్వ తొలగింపునకు మద్దతు ఇవ్వడానికి సుహ్రావర్ది నిరాకరించారు. ఎలక్టోరల్ బాడీ అనర్హత ఉత్తర్వు ద్వారా జనరల్ అతన్ని రాజకీయాల నుండి నిషేధించారు. తరువాత జనవరి 1960లో అబ్డోను ఉల్లంఘించినట్లు అతనిపై ఆరోపణలు వచ్చాయి. జనవరి 1962లో సుహ్రావర్దిని ఎలాంటి విచారణ లేకుండానే దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కరాచీలోని సెంట్రల్ జైలులో అరెస్టు చేసి ఏకాంత నిర్బంధంలో ఉంచారు.

జుల్ఫికర్ అలీ భుట్టో 
జుల్ఫికర్ అలీ భుట్టో 1977, సెప్టెంబరు 3న అరెస్టయ్యారు. కటకటాల వెనక్కు వెళ్లిన పాక్‌ రెండో మాజీ ప్రధానిగా నిలిచారు. జుల్ఫికర్ భుట్టో అరెస్టుకు ముందు 2 నెలల పాటు పాక్‌ ప్రధానిగా ఉన్నారు. ఆగస్టు 1973 నుండి జూలై 1977 వరకు ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. అయితే 1974లో రాజకీయ ప్రత్యర్థిని హత్య చేసేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలో అదే ఏడాది సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. ఆ తర్వాత లాహోర్ హైకోర్టు ఆదేశాల మేరకు విడుదలయ్యారు.

బెనజీర్ భుట్టో 
జుల్ఫికర్ అలీ భుట్టో తర్వాత ఆయన కూతురు బెనజీర్ భుట్టో పాకిస్తాన్ ప్రధాని అయ్యారు. బెనజీర్ రెండు సార్లు పాకిస్తాన్ ప్రధాని అయ్యారు. ఆమె డిసెంబర్ 1988లో మొదటిసారిగా ప్రధానమంత్రి పీఠం ఎక్కారు. 1990, ఆగస్టు వరకు పదవిలో కొనసాగారు. దీని తరువాత ఆమె 1993, అక్టోబర్‌లో రెండవసారి ప్రధానమంత్రి అయ్యారు. 1996 నవంబర్ వరకు పదవిలో కొనసాగారు. పాకిస్తాన్‌లో జియావుల్ హక్ నియంతృత్వ పాలనలో (1977 నుండి 1988 వరకు) ప్రతిపక్ష నేతగా బెనజీర్ క్రియాశీలకంగా వ్యవహరించారు. 1986 ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవం రోజున కరాచీలో జరిగిన ర్యాలీలో బెనజీర్ భుట్టో ప్రభుత్వాన్ని విమర్శించినందుకు అరెస్టయ్యారు.

నవాజ్ షరీఫ్ 
పాక్‌ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా అరెస్టును ఎదుర్కోవలసి వచ్చింది. నవాజ్ షరీఫ్ 1999లో జనరల్ పర్వేజ్ ముషారఫ్ కారణంగా దేశ బహిష్కరణకు గురయ్యారు. అయితే 2007 సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌కు తిరిగి వచ్చారు. ఆయన ఇస్లామాబాద్‌ చేరుకున్నంతనే అరెస్టు చేశారు. ఆ తర్వాత నవాజ్ షరీఫ్‌ను సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించారు. 2018 జూలైలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో పాటు అతని కుమార్తె మరియం నవాజ్‌ను అవినీతి కేసులో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబీ) అరెస్టు చేసి, పదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే  ఆయన రెండు నెలల తర్వాత విడుదలయ్యారు. 2018 డిసెంబర్‌లో సౌదీ అరేబియాలోని స్టీల్ మిల్లుల యాజమాన్యానికి సంబంధించిన కేసులో షరీఫ్‌ తిరిగి జైలు పాలయ్యారు. ఈ కేసులో ఏడేళ్ల శిక్ష అనుభవించారు. 

షాహిద్ ఖాకాన్ అబ్బాసీ
పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) నేత షాహిద్ ఖాకాన్ అబ్బాసీ 2017, జనవరిలో దేశ ప్రధానమంత్రి అయ్యారు. 2018 మే వరకు ఆ పదవిలో కొనసాగారు. షాహిద్ ఖాకాన్ అబ్బాసీ కూడా అరెస్టును ఎదుర్కోవలసి వచ్చింది. 2019 జూలై 19 న కాంట్రాక్టులకు సంబంధించిన కుంభకోణంలో ప్రమేయముందుంటూ అబ్బాసీని ఎన్‌ఏబీ బృందం అతన్ని అరెస్టు చేసింది. ఈ కుంభకోణం చోటుచేసుకున్న సమయంలో ఆయన పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే అరెస్టయిన 7 నెలల తర్వాత అబ్బాసీ బెయిల్ పొందారు. 2020, ఫిబ్రవరి 27న అడియాలా జైలు నుండి విడుదలయ్యారు.
ఇది కూడా చదవండి: అమెరికాలో సెటిలయ్యేందుకు ‘దొంగపెళ్లి’.. చుక్కలు చూపించిన అధికారులు!

మరిన్ని వార్తలు