Pakistan Economic Crisis: లంక పరిస్థితులు పాకిస్తాన్‌లో రిపీట్‌.. చేతులెత్తేసిన పాక్‌ సర్కార్‌!

29 Jan, 2023 16:32 IST|Sakshi

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు శ్రీలంకను మించిన పరిస్థితి దాయాది దేశంలో కనిపిస్తుంది. ఇప్పటికే తిండి దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తానీలపై ప్రభుత్వం మరో బాంబు వేసింది. ఇంధన ధరలను భారీగా పెంచేసింది. ఈ క్రమంలో పాక్‌ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. 

తాజాగా పాక్‌ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఒకేసారి ఏకంగా 35 రూపాయలు పెంచింది. దీంతో, బంకుల వద్ద ప్రజలు బారులు తీరారు. పెట్రోల్ బంకుల వద్ద క్యూలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయని డాన్ ప‌త్రిక పేర్కొంది. ఈ సందర్బంగా పాక్‌ ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌ మీడియాతో మాట్లాడుతూ ఆయిల్ అండ్ గ్యాస్ అధికారుల సిఫార్సుల మేరకే రేట్లను పెంచినట్టు చెప్పారు. గ్లోబల్ మార్కెట్ నుండి చమురు కొనుగోలు చేయడానికి అధిక ధర కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతకు ముందు, ఆర్థిక మంత్రి దార్‌.. పాకిస్తాన్‌ను అల్లా రక్షిస్తాడు అంటూ వ్యాఖ్యలు చేశారు.  

ఇదిలా ఉండగా.. ఆర్థిక సంక్షోభం కారణంగా పాక్‌ కరెన్సీ ఇటీవలే భారీగా పతనమైన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో పాకిస్తాన్‌ రూపాయి పతనమైంది. ఒకేరోజు ఏకంగా  డాలర్‌కు 255 రూపాయలకు పడిపోయింది. ఇక, విదేశీ మార‌క ద్ర‌వ్య నిల్వ‌లు అడుగంట‌డంతో పాకిస్తాన్ కేవ‌లం మూడు వారాలకు స‌రిప‌డా దిగుమతుల‌కు మాత్ర‌మే చెల్లింపులు జ‌రిపే వెసులుబాటు ఉన్నట్టు సమాచారం. సంక్షోభం అధిగ‌మించేందుకు ఐఎంఎఫ్ విడుద‌ల చేసే త‌దుపరి 100 కోట్ల డాల‌ర్ల బెయిల్ అవుట్ ప్రోగ్రాం కోసం పాకిస్తాన్ వేచిచూస్తోంది. మ‌రోవైపు జ‌న‌వ‌రి 31 నుంచి ఫిబ్ర‌వ‌రి 9 వ‌ర‌కూ ఐఎంఎఫ్ ప్ర‌తినిధి బృందం పాకిస్తాన్‌లో ప‌ర్య‌టించ‌నుండ‌గా నిధుల ప్ర‌వాహం ప్రారంభమవుతుంద‌ని పాక్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.

మరిన్ని వార్తలు