పాక్‌ హక్కుల కార్యకర్త రెహ్మాన్‌ మృతి

13 Apr, 2021 12:41 IST|Sakshi

లాహోర్‌: ప్రముఖ పాకిస్తాన్‌ మానవ హక్కుల కార్యకర్త, రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత ఐఏ రెహ్మాన్‌(90) సోమవారం లాహోర్‌లో కన్నుమూశారు. పాక్‌లోని హిందు, క్రైస్తవ మైనారిటీల తరఫున గళం వినిపించి, రాజ్యాంగంలో దైవదూషణకు సంబంధించిన కఠినమైన చట్టాలను రద్దు కోసం పోరాడారు. భారత్‌–పాక్‌ల మధ్య శాంతి నెలకొనేందుకు విశేష కృషి చేశారు. డయాబెటిస్‌తోపాటు తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకడంతో రెండు రోజులుగా ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని కుటుంబసభ్యులు తెలిపారు.

రెహ్మాన్‌కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అవిభాజ్య భారత్‌లోని హరియాణాలో 1930లో జన్మించిన రెహ్మాన్‌ జర్నలిస్ట్‌గా వివిధ పత్రికల్లో 65 ఏళ్లపాటు పనిచేశారు. పాకిస్తాన్‌–ఇండియా పీపుల్స్‌ ఫోరం ఫర్‌ పీస్‌ అండ్‌ డెమోక్రసీ వేదిక వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన కూడా ఒకరు. హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌ (హెచ్‌ఆర్‌సీపీ)కి రెండు దశాబ్దాలపాటు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన మృతికి హెచ్‌ఆర్‌సీపీ చైర్‌పర్సన్‌ జోహ్రా యూసఫ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు