ఎయిర్‌పోర్ట్‌లో యురేనియం కలకలం

13 Jan, 2023 06:30 IST|Sakshi

పాకిస్తాన్‌ నుంచి వచ్చిన పార్సిల్‌లో కనుగొన్న సిబ్బంది

లండన్‌: లండన్‌లోని అత్యంత రద్దీగా ఉండే హీత్రో అంతర్జాతీయ విమానాశ్రయంలో యురేనియం ఉన్న పార్సిల్‌ కలకలం సృష్టించింది. రెండు వారాల క్రితం అంటే గత ఏడాది డిసెంబర్‌ 29న జరిగిన ఈ ఘటనలో ఆలస్యంగా వెలుగుచూసింది. పాకిస్తాన్‌లోని కరాచీ నగరం నుంచి ఈ పార్సిల్‌ బ్రిటన్‌కు చేరినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. తుక్కు ఖనిజాలకు సంబంధించిన కార్గో పార్సిళ్ల మధ్యలో ఈ యురేనియం నింపిన పార్సిల్‌ ఒకదానిని ఎయిర్‌పోర్ట్‌ కార్గో సిబ్బంది స్కానింగ్‌ తనిఖీల సమయంలో గుర్తించారు.

ఒక ఖనిజం కడ్డీల అడుగున దీనిని దాచి ఉంచినట్లు అధికారులు తెలిపారు. వెంటనే దీనిని బోర్డర్‌ ఆఫీసర్లకు అప్పగించగా దూరంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దేశ ఉగ్రవ్యతిరేక దళాలకు ఇచ్చేశారు. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. కరాచీ నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు అక్కడి నుంచి ఒమన్‌ ఎయిర్‌లైన్స్‌ ద్వారా లండన్‌కు వచ్చినట్లు తేల్చారు. ఇరాన్‌ జాతీయులకు అందజేసేందుకే దానిని బ్రిటన్‌కు తరలించారని బ్రిటిష్‌ మీడియాలో వార్తలొచ్చాయి.

పాక్, ఒమన్‌లలో తనిఖీలను దాటించేసి బ్రిటన్‌కు యురేనియంను తరలించడం ఆందోళనకర విషయమని బ్రిటన్‌ సైన్యంలో రసాయనిక ఆయుధాల విభాగం మాజీ అధిపతి హ్యామిస్‌ బ్రెటన్‌ గార్డన్‌ వ్యాఖ్యానించారు. శిలల నుంచి సేకరించే రేడియోధార్మిక యురేనియంను అణు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, రియాక్టర్లలో ఇంధనంగా వినియోగిస్తారు. జలాంతర్గామి, అణ్వాయుధాల్లోనూ వాడతారు. లండన్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన పార్సిల్‌తో మాకు ఎలాంటి ప్రమేయం లేదని పాకిస్తాన్‌ తేల్చి చెప్పింది. మీడియాలో వచ్చే వార్తలన్నీ ఊహాత్మకమని పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ స్పష్టంచేసింది.

మరిన్ని వార్తలు