బస్సు బాంబు దాడిపై పాకిస్తాన్‌ పచ్చి అబద్ధాలు

14 Aug, 2021 07:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ఖైబర్‌ పక్తూంఖ్వా ప్రావిన్స్‌లో గత నెలలో జరిగిన బస్సు బాంబు పేలుడు వెనుక భారత్‌ హస్తం ఉందంటూ పాకిస్తాన్‌ చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ శుక్రవారం ఖండించారు. ఆసియా ప్రాంతంలో స్థానికంగా అస్థిరతకు, ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్తాన్‌ బాహ్య ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు పచ్చి అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు.

పాకిస్తాన్‌లోని ఖైబర్‌ ఫక్తూంఖ్వా ప్రావిన్స్‌లో అప్పర్‌ కోహిస్తాన్‌ జిల్లాలో జరిగిన బస్సు బాంబు పేలుడు ఘటనలో 9 మంది చైనా ఇంజనీర్లు సహా మొత్తం 13 మంది మరణించారు. ఈ దాడికి భారత నిఘా సంస్థ ‘రా’, అఫ్గానిస్తాన్‌కు చెందిన నేషనల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ(ఎన్‌డీఎస్‌) కారణమని పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ ఆరోపించారు. ఈ ఆరోపణలను అరిందమ్‌ బాగ్చీ తిప్పికొట్టారు. భారత్‌ను అప్రతిష్ట పాలు చేయాలన్నదే పాక్‌ పన్నాగమని మండిపడ్డారు. ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటంలో భారత్‌ ముందు వరుసలో నిలుస్తోందని గుర్తుచేశారు. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజంతో కలిసి పని చేస్తోందని అన్నారు. ఉగ్రవాద విష భుజంగాన్ని పాకిస్తాన్‌ పెంచి పోషిస్తోందన్న సంగతి అందరికీ తెలుసని చెప్పారు.  
 

మరిన్ని వార్తలు