మామిడి దౌత్యం.. పాక్‌కు చైనా సహా 32 దేశాల ఝలక్‌

13 Jun, 2021 12:38 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌కు మామిడి పండ్ల షాక్‌ తగిలింది. స్నేహపూర్వకంగా పండ్లు పంపిస్తే.. వద్దని తిప్పి పంపించాయి కొన్ని దేశాలు. ఈ లిస్ట్‌లో మిత్ర దేశం చైనాతో పాటు అమెరికా, కెనెడా, నేపాల్‌, శ్రీలంక.. ఇలా 32 దేశాలున్నాయి. 

అయితే ఈ మామిడి పండ్ల దౌత్యాన్ని ఆయా దేశాలు సున్నితంగానే తిరస్కరించాయి. కరోనా వైరస్‌ క్వారంటైన్‌ కారణంగా చూపిస్తూ మామిడి పండ్లను వెనక్కి పంపాయి. ఈ మేరకు పాకిస్థాన్‌ విదేశీ కార్యాలయానికి ఆయా పార్శిళ్లు వెనక్కి వచ్చేశాయి. కాగా, మేలిమి రకాలైన అన్వర్‌రొట్టోల్‌, సింధారి రకాలు కరోనా ప్రభావంతో ఈసారి పండించకపోవడంతో.. చౌన్సా రకపు మామిడి పండ్లను పాక్‌ అధ్యక్షుడు డాక్టర్‌ అరిఫ్‌ అల్వి పేరు మీదుగా ఆయా దేశాలకు పంపింది పాక్‌. 

గల్ఫ్‌ దేశాలు టర్కీ, యూకే, అఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌, రష్యా సహా.. అన్ని దేశాలు వద్దని పంపించడం విశేషం. ఇక ఫ్రెంచ్‌ అధ్యక్ష కార్యాలయానికి పంపినట్లు పాక్‌ చెప్తున్నప్పటికీ.. అవతలి నుంచి ఎలాంటి స్పందన లేదు. కాగా, ప్రతీ ఏడాది ఇలా స్నేహ పూర్వక సంబంధాల కోసం పాక్‌ ఇతర దేశాల నేతలకు మామిడి పండ్లు పంపడం ఆనవాయితీగా వస్తోంది. 2015లో  నరేంద్ర మోదీ, ప్రణబ్‌ముఖర్జీ, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, సోనియా గాంధీకి అప్పటి  పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీప్‌ మామిడి పండ్లు పంపించాడు కూడా.

మరిన్ని వార్తలు