Pakistan Power Crisis: పాక్‌లో ఇంటర్నెట్‌ బంద్ హెచ్చరికలు‌! కారణం ఏంటంటే..

1 Jul, 2022 09:39 IST|Sakshi

ఇస్లామాబాద్‌: తీవ్ర విద్యుత్‌ సంక్షోభం నడుమ.. పాకిస్థాన్‌లో ఇంటర్నెట్‌ బంద్‌ హెచ్చరికలు జారీ అయ్యాయి. టెలికామ్‌ ఆపరేటర్లు మూకుమ్మడిగా మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేస్తామని గురువారం అల్టిమేటం జారీ చేశాయి. 

ఈ మేరకు.. నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బోర్డు(NIBT) ఒక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా గంటల తరబడి కరెంట్‌ కోతలు కొనసాగుతున్నాయి. అంతరాయం వారి(టెలికాం ఆపరేటర్ల) కార్యకలాపాలకు ఇబ్బందులను కలిగిస్తున్నాయి. అందుకే టెలికామ్‌ ఆపరేటర్లు మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలు ఆపేస్తామని హెచ్చరిస్తున్నారు అని ఎన్‌ఐబీటీ ప్రకటించింది. 

పాక్‌ దేశ ఆవిర్భావం తర్వాత ఈ స్థాయిలో విద్యుత్ కోతలు ఎదుర్కొవడం ఇదే ప్రథమం. ఇక విద్యుత్‌సంక్షోభం మునుముందు మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రధాని షెహబాబ్‌ షరీఫ్‌ ముందస్తు ప్రకటనలు చేయడం గమనార్హం. ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌) సరఫరా ఇబ్బందికరంగా మారిందని, అయితే ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు. 

మరోవైపు మునుపెన్నడూ లేని విధంగా జూన్‌ నెలలో.. నాలుగు ఏళ్ల తర్వాత అధికంగా చమురు ఇంధనాలను పాక్‌ దిగుమతి చేసుకుంది. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో సహజవాయువు విషయంలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు