పాకిస్తాన్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. సీనియర్‌ మంత్రిని కిడ్నాప్‌ చేసి..

9 Oct, 2022 15:21 IST|Sakshi

దాయాది దేశం పాకిస్తాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాక్​ సీనియర్​ మంత్రి అబైదుల్లా బైగ్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. అనంతరం జైల్లో ఉన్న తమ గ్రూప్‌ సభ్యులను విడిచిపెట్టాలని ఉగ్రవాదులు డిమాండ్‌ చేశారు. దీంతో, ఉగ్రవాదుల షరతులకు అంగీకారం తెలిపిన పాక్‌ మీడియా పేర్కొంది. 

వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి పాకిస్తాన్‌కు చెందిన సీనియర్‌ మంత్రి, మరో ఇద్దరిని ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. కాగా, ఈ విషయాన్ని అధికారులు బయటకు చెప్పకుండా సీక్రెట్‌గా ఉంచారు. అయితే, ఉగ్రవాదులు తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేశారు. నంగా పర్బత్‌, దియామేర్‌ ప్రాంతాల్లో విదేశీయులను ఊచకోత కోసిన ఉగ్రవాదులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. 

దీంతో, వారిని విడుదల చేయాలని హెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ కమాండర్‌, మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న హబీబుర్‌ రహమాన్‌ డిమాండ్‌ చేస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అనంతరం, ఉగ్రవాదుల డిమాండ్లను ‍ప్రభుత్వం అంగీకరించడంతో ఆ ముగ్గురిని ఉగ్రవాదులు శనివారం విడుదల చేసినట్లు అక్కడి మీడియా పేర్కొంది. కాగా, అబైదుల్లా.. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. దేశంలో సీనియర్‌ నేత కావడంతో ఉగ్రవాదుల డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు