పాక్‌ వరదలకు మరో 119 మంది బలి

29 Aug, 2022 06:27 IST|Sakshi
ఇల్లు కోల్పోయాక పెషావర్‌ శివారులో తరలిపోతున్న ఓ కుటుంబం

ఇస్లామాబాద్‌:  పాకిస్తాన్‌లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల వల్ల గత 24 గంటల్లో 119 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,000 మార్కును దాటేసింది. దేశంలో జూన్‌ 14 నుంచి భీకర వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా దక్షిణ, నైరుతి పాకిస్తాన్‌లో తీవ్రత అత్యధికంగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 1,033 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 1,527 మంది క్షతగాత్రులయ్యారని పాకిస్తాన్‌ నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ(ఎన్‌డీఎంఏ) ఆదివారం ప్రకటించింది.

వరదల కారణంగా 3,451.5 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయి. 147 వంతెనలు దెబ్బతిన్నాయి. 170 దుకాణాలు నేలమట్టమయ్యాయి. 9.49 లక్షల ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎంతమేరకు ఆర్థిక నష్టం వాటిల్లందనేదానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని పాక్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ చెప్పారు. రూ.వందల కోట్ల  నష్టం వాటినట్లు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. అంతర్జాతీయ సమాజం ఆదుకోవాలని పాక్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.
 

మరిన్ని వార్తలు