పాక్‌ అణు శాస్త్రవేత్త ఖదీర్‌ ఖాన్‌ కన్నుమూత

11 Oct, 2021 05:03 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌కు చెందిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త, ఆ దేశ అణు పితామహుడిగా పేరు తెచ్చుకున్న అబ్దుల్‌ ఖదీర్‌ఖాన్‌ (85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖదీర్‌ ఖాన్‌ ఆదివారం ఉదయం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ప్రభుత్వం తెలిపింది. 1936లో మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ నగరంలో ఖదీర్‌ ఖాన్‌ జన్మించారు. దేశ విభజన సమయంలో 1947లో ఖదీర్‌ ఖాన్‌ కుటుంబం పాకిస్తాన్‌కు వలసవెళ్లింది. కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఆగస్ట్‌ 26వ తేదీన ఇస్లామాబాద్‌లోని ఖాన్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ(కేఆర్‌ఎల్‌) ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి రావల్పిండిలోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు. కోవిడ్‌ నుంచి కోలుకున్నాక డిశ్చార్జి చేశారు.

ఆదివారం ఉదయం స్వల్ప అనారోగ్యానికి గురి కావడంతో కేఆర్‌ఎల్‌కి తీసుకు రాగా అక్కడే ఆయన కన్నుమూశారని మీడియా తెలిపింది. ఇస్లామాబాద్‌లోని ఫైసల్‌ మసీదులో అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఖదీర్‌ఖాన్‌ మృతికి అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వి, ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. పాకిస్తాన్‌ 1998లో అణు పరీక్ష నిర్వహించడంతో ఖదీర్‌ ఖాన్‌ పేరు మారుమోగిపోయింది. ముస్లిం దేశాల్లో మొట్టమొదటి సారిగా అణు బాంబు తయారీ సామర్థ్యం సొంతం చేసుకున్న దేశంగా పాకిస్తాన్‌ నిలిచిపోయింది. అయితే, పాకిస్తాన్‌ నుంచి ఇరాన్, ఉత్తరకొరియాలకు అణు పరిజ్ఞానం బదిలీ చేసినట్లు బహిరంగంగా అంగీకరించడం ఆయన ప్రతిష్టను దెబ్బతీసింది. 2004 నుంచి ఐదేళ్లపాటు ప్రభుత్వం ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచింది.

మరిన్ని వార్తలు