ఇమ్రాన్‌ అసమర్థుడు.. రాజీనామా చేయాల్సిందే

21 Sep, 2020 11:15 IST|Sakshi

సైన్యంతో యుద్ధానికి సైతం సిద్ధం అంటోన్న పాక్‌ ప్రతిపక్షం

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. తక్షణమే ఆయన రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చే లక్ష్యంతో 'పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్‌' అనే కొత్త కూటమిని ఏర్పాటు చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీలు ఆదివారం ప్రకటించాయి. ఈ మేరకు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నిర్వహించిన ఆల్ పార్టీస్‌ కాన్ఫరెన్స్ (ఏపీసీ) 26 పాయింట్ల ఉమ్మడి తీర్మానాన్ని ఆమోదించింది. పాకిస్తాన్ ముస్లిమ్స్‌ లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), జామియాత్‌ ఉలేమా-ఈ-ఇస్లాం ఫాజల్ (జేయూఐ-ఎఫ్)తో పాటు అనేక ఇతర పార్టీలు దీనిలో పాలుపంచుకున్నాయి. అనంతరం విలేకరుల సమావేశంలో జామియాత్‌ ఉలేమా-ఈ-ఇస్లాం(జేయూఐ-ఎఫ్) చీఫ్ మౌలానా ఫజ్ల్-ఉర్-రెహమాన్ మాట్లాడుతూ.. ‘ఎన్నికైన ప్రధానమంత్రి ఇమ్రాన్ అహ్మద్ నియాజీని వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. వీటిలో న్యాయవాదులు, వ్యాపారులు, కార్మికులు, రైతులు పౌర సమాజం పాల్గొనడం జరుగుతుంది’ అన్నారు. (చదవండి: ఇమ్రాన్ ముందు అనేక‌ సవాళ్లు)

అంతేకాక ‘మొదటి దశలో, అక్టోబర్‌లో సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా, పంజాబ్‌లలో ర్యాలీలు జరుగుతాయి. రెండవ దశలో, డిసెంబర్ నుంచి దేశవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు జరుగుతాయి. ఇక మూడవ దశలో భాగంగా వచ్చే ఏడాది జనవరిలో ఇస్లామాబాద్ వైపు లాంగ్ మార్చ్ నిర్వహిస్తాం’ అని రెహామాన్ పేర్కొన్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వాన్ని తొలగించటానికి, ఉమ్మడి ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం, పార్లమెంటు రాజీనామాలతో సహా అన్ని వ్యూహాలను ఉపయోగిస్తుందని తెలిపారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావాల్ భుట్టో జర్దారీ, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీల మార్గదర్శకత్వం, మద్దతుతో ప్రతిపక్షాలు ముందుకు వెళ్తాయని నొక్కి చెప్పారు. అయితే, ఉద్యమ నాయకుడిని ఇంకా నిర్ణయించలేదన్నారు బిలావాల్. (చదవండి: ఇమ్రాన్‌ లాడెన్‌ను కీర్తిస్తారా..!)

అంతకుముందు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆల్‌ పార్టీ కాన్ఫరెన్స్‌లో వీడియో లింక్ ద్వారా ప్రసంగించారు. ప్రతిపక్ష పార్టీల పోరాటం ఇమ్రాన్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా కాదని తనలాంటి "అసమర్థ" వ్యక్తిని అధికారంలోకి తెచ్చిన వారిపైన అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నవాజ్‌ షరీఫ్‌ మాట్లాడుతూ.. ‘మా పోరాటం ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా కాదు. తనలాంటి అసమర్థ వ్యక్తిని అధికారంలోకి తీసుకురావడానికి (2018 లో) ఎన్నికలను తారుమారు చేసి దేశాన్ని నాశనం చేసినవారిపై మా పోరాటం’ అని నవాజ్‌ షరీఫ్‌ స్పష్టం చేశారు. ఈ క్రమంలో శక్తివంతమైన పాక్‌ సైన్యం ఈ రాజకీయాలకు దూరంగా ఉండాలని, జాతీ పితా ముహమ్మద్ అలీ జిన్నా రాజ్యాంగాన్ని, దూరదృష్టిని అనుసరించడానికి అవకాశం కల్పించాలని కోరారు. అవసరమైతే ఆర్మీతో యుద్ధానికి సైతం వెనకాడమన్నారు షరీఫ్‌. పాకిస్తాన్ సైన్యం దాదాపు 70 సంవత్సరాలకు పైగా దేశాన్ని ఏలుతోంది. అంతేకాక దేశ భద్రత, విదేశాంగ విధానం వంటి విషయాలలో గణనీయమైన స్థాయిలో అధికారం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు