Viral Video: పాపం పాకిస్తానీలు.. గోధుమ పిండి కోసం ట్రక్కు వెనకాల పరుగులు...

16 Jan, 2023 12:57 IST|Sakshi

ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉంది. తనడానికి తిండి కూడా సరిగా లేక ప్రజలకు ఆకలితో అలమటిస్తున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.  ఈ దయనీయ పరిస్థితులకు అద్దం పట్టే ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో గోధుమ పిండి లోడుతో వెళ్తున్న ఓ టక్కు వెనకాల పరుగెత్తుతున్నారు పాకిస్తానీలు. బైక్‌లు వేసుకుని ర్యాలీగా దాన్ని ఫాలో అవుతున్నారు. తమకు ఓ పిండి బస్తా ఇవ్వమని చేతిలో డబ్బులు పట్టుకుని ప్రాధేయపడుతున్నారు.

ఈ వీడియోను నేషనల్ ఈక్వాలిటీ పార్టీ జమ్ముకశ్మీర్ గిల్గిత్ బాల్టిస్తాన్ అండ్ లద్దాఖ్ (జేకేజీబీఎల్) ఛైర్మన్ ప్రొఫెసర్ సజ్జాద్ రాజా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఒక్క పిండి బస్తా కోసం పాకిస్తాన్‌లో ప్రజలు ఎలా ట్రక్కు వెనకాల పరుగెత్తుతున్నారో చూడండి. దీన్ని చూసైనా జమ్ముకశ్మీర్ ప్రజలు కళ్లు తెరవాలి. వాళ్లు పాకిస్తాన్‌లో లేనందుకు అదృష్టవంతులు. మన భవిష్యత్‌పై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇంకా ఉంది. పాకిస్తాన్‌లో అసలు మనకు భవిష్యత్ ఉందా? అని ప్రశ్నించారు.

లాహోర్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ 15 కిలోల గోధుమ పండి బస్తా ధర రూ.2,050 ఉంది. జనవరి 6నే బస్తాపై రూ.150 పెంచారు. ఆర్థిక, ఆహార సంక్షోభంతో పాకిస్తాన్‌లో పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
చదవండి: ప్రపంచాన్ని చుట్టివచ్చిన వీరుడు.. వేల కోట్లకు అధిపతి.. విమానంలో దిక్కులేని చావు..

మరిన్ని వార్తలు