అఫ్గాన్‌లో పాకిస్తాన్‌ విధ్వంసకర పాత్ర

13 Nov, 2021 06:21 IST|Sakshi

సీఆర్‌ఎస్‌ నివేదిక

వాషింగ్టన్‌: అఫ్గానిస్తాన్‌ వ్యవహారాల్లో పొరుగు దేశం పాకిస్తాన్‌ చాలా ఏళ్లుగా చురుకైన పాత్ర పోషిస్తున్నట్లు అమెరికాలో కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌(సీఆర్‌ఎస్‌) తన నివేదికలో వెల్లడించింది. స్వతంత్ర విషయ నిపుణులు ఈ నివేదికను రూపొందించారు. అఫ్గాన్‌లో పాక్‌ విధ్వంసకర, అస్థిరతకు కారణమయ్యే పాత్ర పోషిస్తున్నట్లు సీఆర్‌ఎస్‌ రిపోర్టు తేల్చిచెప్పింది. తాలిబన్‌ ముష్కరులకు పాక్‌ పాలకుల అండదండలు బహిరంగ రహస్యమేనని పేర్కొంది.

పాకిస్తాన్, రష్యా, చైనా, ఖతార్‌ వంటి దేశాలు తాలిబన్‌ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించి, సంబంధాలు పెంచుకొనే అవకాశం ఉందని తెలిపింది. అదే జరిగితే అమెరికా ఒంటరి కాక తప్పదని పేర్కొంది. అఫ్గాన్‌పై అమెరికా పట్టు సడలిపోతుందని పేర్కొంది. ఫలితంగా తాలిబన్‌ పాలకులు అమెరికా ఒత్తిళ్లను ఎదిరించే పరిస్థితి ఉత్నన్నమవుతుందని సీఆర్‌ఎస్‌ రిపోర్టు వివరించింది. ‘‘అఫ్గాన్‌ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించుకోవడాన్ని కొందరు పాక్‌ విజయంగా భావిస్తున్నారు. దీంత్లో అక్కడ పాక్‌ పెత్తనం పెరిగిపోతుంది. అఫ్గాన్‌పై భారత్‌  ప్రభావాన్ని తగ్గించాలన్న పాక్‌ యత్నాలు తీవ్రమవుతాయి’’ అని పేర్కొంది.

ఢిల్లీ సదస్సును స్వాగతించిన తాలిబన్‌
కాబూల్‌: అఫ్గానిస్తాన్‌పై భారత్‌ నిర్వహించిన ‘ఢిల్లీ రీజినల్‌ సెక్యూరిటీ డైలాగ్‌’ను తాలిబన్‌ ప్రభుత్వం స్వాగతించింది. భారత్‌ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా సలహాదారుల సదస్సులో మొత్తం 8 దేశాలు పాల్గొన్న విషయం తెలిసిందే. సదస్సు నేపథ్యంలో భారత్‌ చేసిన డిమాండ్లన్నిటినీ తాము నెరవేర్చామని తాలిబన్‌ ప్రభుత్వం తెలిపిందని టోలో వార్తా సంస్థ తెలిపింది. ‘ఇస్లామిక్‌ ఎమిరేట్‌(తాలిబన్‌) భారత్‌ సదస్సును స్వాగతిస్తోంది. పాలన విషయంలో గట్టి చర్యలు తీసుకుంటున్నాం.

అఫ్గాన్‌ భూభాగాన్ని తమకు వ్యతిరేకంగా ఉపయోగించుకునే ప్రమాదం ఉందని ఏ ఒక్క దేశం కూడా ఆందోళన చెందవద్దు’అని అఫ్గాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇనాముల్లా సమాంగని తెలిపారని టోలో న్యూస్‌ పేర్కొంది. అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితులను, ఎదుర్కొంటున్న సవాళ్లను అంచనా వేయడంలో ఢిల్లీ భేటీ అసాధారణ చొరవ చూపిందని పేర్కొంది.  ‘అఫ్గానిస్తాన్‌కు సాయం అందిస్తున్న దేశాల్లో ఒకటైన భారత్‌.. ఢిల్లీ సదస్సును ప్రభావవంతంగా నిర్వహించిందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుడు సయద్‌ హకీమ్‌ కమాల్‌ చెప్పారు.  ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ ధోవల్‌ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో రష్యా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ దేశాలు పాల్గొన్నాయి.

మరిన్ని వార్తలు