Pakistan Constitution Crisis: రాజకీయ పిచ్‌పై రాణించని క్రికెటర్‌

4 Apr, 2022 06:21 IST|Sakshi

క్రికెటర్‌గా 21 ఏళ్ల పాటు అనమానమైన ఆల్‌రౌండ్‌ ప్రతిభ చూపడమే గాక పాకిస్థాన్‌కు ప్రపంచ కప్‌ కూడా అందించిన ఇమ్రాన్‌ అహ్మద్‌ ఖాన్‌ నియాజీ కీలకమైన రాజకీయ పిచ్‌పై మాత్రం చేతులెత్తేశారు. రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘంగా ప్రయత్నించి ప్రధాని పీఠమెక్కినా ఏ మాత్రం మెరుపులు మెరిపించలేకపోయారు. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో ఘోరంగా విఫలమై అపకీర్తి మూటగట్టుకున్నారు.

మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌
పాకిస్థాన్‌లోని మియావలీలో పష్తూన్‌ తెగకు చెందిన ఇక్రాముల్లా ఖాన్‌ నియాజీ, షౌకత్‌ ఖానుమ్‌ దంపతులకు 1952లో ఇమ్రాన్‌ జన్మించారు. లాహోర్‌తో పాటు ఇంగ్లడ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్నత చదువులు చదివారు. 21 ఏళ్లు క్రికెటర్‌గా ఓ వెలుగు వెలిగారు. 1992లో తన సారథ్యంలో పాక్‌కు ఏకైక వన్డే ప్రపంచ కప్‌ సాధించి పెట్టారు. 43 ఏళ్లొచ్చేదాకా అవివాహితునిగానే ఉండి మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా పాక్‌ ప్రజల మనసు దోచుకున్నారు. 1996లో పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ పార్టీని స్థాపించారు.

20 ఏళ్లకు గానీ నవాజ్‌ షరీఫ్‌ కుటుంబానికి చెందిన పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌), భుట్టోలకు చెందిన పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీల హవాను అధిగమించలేకపోయారు. 2002లో జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2013లో పీటీఐని రెండో అతి పెద్ద పార్టీగా నిలిపారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతానని, పేదరికాన్ని నిర్మూలించి పాక్‌ను ఇస్లామిక్‌ సంక్షేమ రాజ్యంగా రూపుదిద్దుతాననే హామీలతో 2018 సాధారణ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపారు.

సొంతంగా మెజారిటీ రాకున్నా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధాని కల నెరవేర్చుకున్నారు. కానీ ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమవుతూ వచ్చారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి దేశాన్ని దివాలా అంచుకు నెట్టేశాయి. విదేశాంగ విధానంలో కూడా ఇమ్రాన్‌ తేలిపోయారు. భారత్‌తో కయ్యం కొనసాగించడమే గాక రష్యాకు దగ్గరయ్యే క్రమంలో అర్థం లేని దూకుడు ప్రదర్శించి చిరకాల మిత్రుడు అమెరికాకూ దూరమయ్యారు. ఆర్మీ చీఫ్‌ బజ్వా పదవీకాలం పొడిగింపును అడ్డుకునేందుకు విఫలయత్నం చేసి కీలకమైన సైన్యం ఆశీస్సులు కోల్పోయారు.

వ్యక్తిగతంగానూ ఒడిదుడుకులే
ఇమ్రాన్‌ వ్యక్తిగత జీవితమూ ఒడిదుడుకులమయమే. ఆయన మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. 1995లో ఇంగ్లండ్‌కు చెందిన బిలియనీర్‌ కూతురు జెమీమా గోల్డ్‌స్మిత్‌ను పెళ్లాడారు. ఇద్దరు కొడుకులు పుట్టాక విడాకులు తీసుకున్నారు. 2015లో టీవీ యాంకర్‌ రెహాం ఖాన్‌ను పెళ్లాడి 10 నెలలకే విడిపోయా రు. 2018లో తన ఆధ్యాత్మిక గురువు బుష్రా మనేకాను ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్నారు.

మరిన్ని వార్తలు