కామాంధులపై పాక్‌ సర్కారు ఉక్కుపాదం!

25 Nov, 2020 10:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లైంగిక దాడికి పాల్పడితే ఇకపై అంతే!

ఇస్లామాబాద్‌: కామంధులపై ఉక్కుపాదం మోపేందుకు ఇమ్రాన్‌ ఖాన్‌ సర్కారు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మహిళలు, చిన్నారులపై అత్యాచారాల కట్టడికై కఠినమైన చట్టాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రేపిస్టుల లైంగిక పటుత్వం తగ్గేలా ఆపరేషన్లు(కాస్ట్రేషన్‌) నిర్వహించడం సహా బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన బిల్లుకు పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆమోదం తెలిపారని స్థానిక చానెల్‌ జియో టీవీ వెల్లడించింది. మంగళవారం నాటి కేబినెట్‌ సమావేశంలో భాగంగా న్యాయ శాఖ ముసాయిదాను ప్రవేశపెట్టగా ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అత్యాచార నిరోధక కార్యాకలాపాల్లో అధిక సంఖ్యలో మహిళలను భాగస్వామ్యం చేయడం, సాక్షులకు రక్షణ కల్పించడం, త్వరితగతిన రేప్‌ కేసులు నమోదు వంటి అంశాలను డ్రాఫ్ట్‌కాపీలో చేర్చినట్లు తెలిపింది.(చదవండి: 200 మీటర్ల సొరంగం; ఆత్మాహుతి దాడికి యత్నం!)

ఇక పాకిస్తాన్‌లో మహిళలపై అకృత్యాలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో కఠినమైన చట్టం తీసుకురావాల్సిందిగా ఇమ్రాన్‌ భావించారని, పౌరులకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని, అదే సమయంలో వారి వివరాలు బహిర్గతం కాకుండా జాగ్రత్త పడతామని ఇమ్రాన్‌ వ్యాఖ్యానించినట్లు పేర్కొంది.(చదవండి: పాకిస్తాన్‌కు ఫ్రాన్స్‌ షాక్‌)

కాగా నూతన చట్ట రూపకల్పనలో భాగంగా.. లైంగిక దాడి కేసుల్లో దోషులను బహిరంగంగా ఉరితీయాలని కొంతమంది మంత్రులు ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఇందుకు సుముఖంగా లేని ఇమ్రాన్‌ ఖాన్‌, ప్రస్తుతానికి అలాంటి ఆలోచన వద్దని వారించినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం లాహోర్‌లో ఏడేళ్ల బాలిక అత్యాచారం, హత్య, ఇటీవల ఓ మహిళపై సామూహిక లైంగికదాడి ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా