ఎట్టకేలకు... ఇమ్రాన్‌ ఇంటికి

10 Apr, 2022 04:56 IST|Sakshi

174 ఓట్లతో నెగ్గిన విపక్షాల అవిశ్వాస తీర్మానం

అర్ధరాత్రి తర్వాత జరిగిన ఓటింగ్‌

రోజంతా నాటకీయ పరిణామాలు

గలాభా మధ్య పలుమార్లు వాయిదా

అర్ధరాత్రి స్పీకర్, డిప్యూటీ రాజీనామాలు

అధికార పీటీఐ సభ్యుల వాకౌట్‌

ఇస్లామాబాద్‌: నెలకు పైగా నానా మలుపులు తిరుగుతూ వచ్చిన పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం కథ ఎట్టకేలకు కంచికి చేరింది. పాక్‌ జాతీయ అసెంబ్లీలో శనివారం రోజంతా జరిగిన నాటకీయ పరిణామాల అనంతరం అర్ధరాత్రి దాటాక అధికార సభ్యుల గైర్హాజరీలో జరిగిన ఓటింగ్‌లో 174 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దాంతో విపక్షాల అవిశ్వాస తీర్మానం నెగ్గడం, ఇమ్రాన్‌ పదవీచ్యుతుడు కావడం చకచకా జరిగిపోయాయి.

అంతకుముందు జాతీయ అసెంబ్లీ వేదికగా శనివారం రోజంతా పాక్‌ రాజకీయాలు నానా మలుపులు తిరిగాయి. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తీర్మానంపై ఓటింగ్‌ జరిపేందుకు ఉదయం 10.30కు సమావేశమైన సభ అర్ధర్రాతి దాకా నాలుగైదుసార్లు వాయిదా పడింది. స్పీకర్‌ అసద్‌ ఖైజర్‌ ఉద్దేశపూర్వకంగానే ఓటింగ్‌ను జాప్యం చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. తక్షణం ఓటింగ్‌ చేపట్టాలని కోరాయి. కానీ ఓటింగ్‌కు స్పీకర్‌ ససేమిరా అన్నారు.

‘‘ఓటింగ్‌ జరిపి ఇమ్రాన్‌తో నా 30 ఏళ్ల బంధాన్ని తెంచుకోలేను. కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కోవాల్సి వచ్చినా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటింగ్‌ జరపబోను’’ అని కుండబద్దలు కొట్టారు. ఈ గలాభా మధ్యే రాత్రి వేళ ఇమ్రాన్‌ తన నివాసంలో అత్యవసర కేబినెట్‌ సమావేశం నిర్వహించారు. రాజీనామా చేయబోయేది లేదని స్పష్టం చేశారు. ఆయన సభకు కూడా వెళ్లలేదు. అనంతరం పాక్‌ కాలమానం ప్రకారం రాత్రి 10.30 తర్వాత స్పీకర్‌ ఇమ్రాన్‌ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.

విదేశీ కుట్రకు రుజువుగా కేబినెట్‌ తనకు ముఖ్యమైన పత్రాలు అందజేసిందని, వాటిని సీజేఐ, విపక్ష నేత పరిశీలించాలని కోరారు. ‘‘ఓటింగ్‌ జరిపి విదేశీ కుట్రలో భాగం కాలేను. రాజీనామా చేస్తున్నా’’ అని అర్ధరాత్రి 11.30కు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం సూరి కూడా ఆయన బాటలోనే నడిచారు. స్పీకర్‌ సూచన మేరకు విపక్ష పీఎంఎల్‌ (ఎన్‌)కు చెందిన ప్యానల్‌ చైర్మన్‌ అయాజ్‌ సాదిక్‌ అధ్యక్షతన అర్ధరాత్రి 11.45కు ఓటింగ్‌ ప్రక్రియ చేపట్టారు. 11.50కి అధికార పీటీఐకి చెందిన 156 మంది ఎంపీలూ సభ నుంచి వెళ్లిపోయారు.

సభ నిబంధనల మేరకు 11.58కి సభను మర్నాటికి వాయిదా వేశారు. నాలుగు నిమిషాల అనంతరం అర్ధరాత్రి 12.02కు సభ తిరిగి సమావేశమైంది. అనంతరం మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానాన్ని ఓటింగ్‌కు స్వీకరిస్తున్నట్టు సభాపతి ప్రకటించారు. తర్వాత తలుపులన్నీ మూసేసి ఓటింగ్‌ చేపట్టారు. 12.10కి ఓటింగ్‌ జరిగింది. 342 మంది సభ్యులున్న సభలో అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే విపక్షాలకు కనీసం 172 మంది మద్దతు అవసరం. రాత్రి ఒంటిగంటకు 174 మంది అనుకూలంగా ఓటేయడంతో తీర్మానం సులువుగా గట్టెక్కింది.

అంతకుముందు, శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటింగ్‌ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఇమ్రాన్‌ కావాలనే ధిక్కరిస్తున్నారంటూ విపక్షాలు మరోసారి కోర్టు తలుపు తట్టాయి. ఇమ్రాన్‌ దేశం విడిచిపోకుండా చూడాలంటూ ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనిస్తూ వచ్చిన సుప్రీంకోర్టు ప్రధా న్యాయమూర్తి జస్టిస్‌ ఉమర్‌ అతా బందియాల్‌ శనివారం అర్ధరాత్రి 12 తర్వాత కోర్టును సమావేశపరచాలని అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. పూర్తిస్థాయి ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి, కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణ జరుపుతామని ప్రకటించారు. ఈలోపు పరిస్థితులు మారి పరిణామాలు ఓటింగ్‌కు దారి తీశాయి.  

భారత్‌కే వెళ్లిపో... ఇమ్రాన్‌పై విపక్షాల ధ్వజం
భారత్‌ను ప్రశంసిస్తూ పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై అక్కడి విపక్షాలు మండిపడ్డాయి. భారత్‌ అంతగా నచ్చితే అక్కడికే వెళ్లిపోవాలని పీఎంఎల్‌ (ఎన్‌) నేత, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూతురు మరియం అన్నారు. భారత్‌ సిసలైన సార్వభౌమ దేశమని, ఏ అగ్రరాజ్యం కూడా దాన్ని శాసించలేదంటూ ఇమ్రాన్‌ ప్రశంసించడం తెలిసిందే. ‘‘అవిశ్వాస తీర్మానాల విషయంలో కూడా భారత్‌ను అనుసరించు. అక్కడి ప్రధానులు 27 దాకా అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నారు. వాజ్‌పేయి వంటివారు కేవలం ఒక్క ఓటుతో ఓడి హుందాగా తప్పుకున్నారు. అంతే తప్ప నీలా ఎవరూ ప్రజాస్వామ్యంతో, రాజ్యాంగంతో, విలువలతో ఇష్టానికి ఆడుకోలేదు’’ అని ఆయన్నుద్దేశించి మరియం అన్నారు. ‘‘ఇమ్రాన్‌ ఓ సైకో. ఆయనకు పిచ్చెక్కింది’’ అంటూ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు